ఒక హీరోకు మరో హీరో సాయిం చేసుకోవటం కొత్తేమీ కాదు. మరీ ముఖ్యంగా తమిళ స్టార్ హీరోలకు ఇక్కడ హీరోలకు, ఇక్కడ హీరోలకు తమిళ స్టార్స్ తమ తమ ఏరియాల్లో మాట సాయిం చేస్తూంటారు. ప్రమోషన్ చేసి పెడుతూంటారు. ఓ రకంగా ఇచ్చి పుచ్చుకునే ధోరణి కూడా నడుస్తోంది. ఇప్పుడు అలాంటి స్కీమ్ నే విజయ్ దేవరకొండ,సూర్య చేయబోతున్నారు. 

సూర్య హీరోగా నటించిన  ‘బందోబస్త్’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిధిగా వస్తారని తెలుస్తోంది. ఎందుకంటే గతంలో విజయ్ దేవరకొండ ‘నోటా’ సినిమా తమిళ్ వెర్షన్ ఫంక్షన్ కి సూర్య వెళ్లి క్రేజ్ తీసుకువచ్చారు. ఇప్పుడు తెలుగులో క్రేజ్ కోసం విజయ్ దేవరకొండ తన వంతుగా సాయం చేయబోతున్నారు. 

ఇక సూర్య నటిస్తున్న తాజా సినిమా ‘బందోబస్త్’. డిఫరెంట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘రంగం’ ఫేమ్ కె.వి. ఆనంద్ దర్శకుడు. తెలుగు ప్రేక్షకులకు ‘నవాబ్’, విజువల్ వండర్ ‘2.0’ చిత్రాలు అందించిన లైకా ప్రొడక్షన్స్ పతాకం పై ప్రముఖ తమిళ నిర్మాత సుభాస్కరణ్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను సెప్టెంబర్ రెండో వారంలో గ్రాండ్ గా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

సూర్య సరసన సాయేషా సైగల్ నటిస్తున్న ఈ సినిమాలో భారత ప్రధానిగా మలయాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్‌, కీలక పాత్రలో ఆర్య నటిస్తున్నారు. బోమన్ ఇరానీ, ఆర్య, సాయేషా సైగల్, సముద్రఖని, పూర్ణ, నాగినీడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.