టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకి నానికి మంచి రిలేషన్ ఉన్న సంగతి తెలిసిందే. నాని నటించిన 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాలో విజయ్ కీలకపాత్ర పోషించాడు. ఆ తరువాత కొద్దిరోజుల్లోనే విజయ్ కి భారీ క్రేజ్ వచ్చింది. 'గీత గోవిందం' సినిమాతో నాని కంటే తన మార్కెట్ ని మరింత పెంచేసుకున్నాడు.

అయితే కొన్ని విషయాలలో మాత్రం దేవరకొండ తన స్నేహితుడు నానినే ఫాలో అవుతున్నాడు. సినిమాల మార్కెట్ విషయంలో నాని చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. తన సినిమాల బడ్జెట్ పెరగకుండా చూసుకుంటాడు.

కథకు తగ్గట్లుగా ఖర్చు పెట్టిస్తుంటాడు. తన సినిమా బయ్యర్లకు అందుబాటులో ఉండేలా చూసుకుంటాడు. ఈ కారణంగానే నాని మార్కెట్ స్థిరంగా ఉంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా ఇదే ఫాలో అవుతున్నాడు. ప్రస్తుతం మార్కెట్ లో విజయ్ కి ఉన్న క్రేజ్ ని బట్టి అతడిపై నలభై కోట్లు పెట్టడానికి కూడా నిర్మాతలు రెడీ అయిపోతున్నారు.

కానీ తన సినిమాలని పాతిక కోట్ల రేంజ్ లోనే ఉంచడానికి ఇష్టపడుతున్నాడు విజయ్. ఒక వేళ సినిమా గనుక మిస్ ఫైర్ అయితే నష్టాలు పెద్దగా ఉండవని, బయ్యర్లకు తనపై నమ్మకం పోదని నమ్ముతున్నాడు. బడ్జెట్, బిజినెస్ విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అవుతూ తన పేరుని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు విజయ్ దేవరకొండ.