సినిమా ప్రపంచంలో ఏ పనైనా డబ్బు లేకుండా జరగదు. ఇక ఎవరైనాసరే రూపాయి పెడితే రెండు రూపాయలు లాభం రావాలని ఆశిస్తారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమాపై ఓ తమిళ్ నిర్మాత అలాంటి ఆశలే పెట్టుకున్నాడు. సినిమా విడుదలకు సిద్దమయితే నిర్మాతల కష్టాలు అన్ని ఇన్ని కావు. 

అయితే ఈ మధ్య డబ్బింగ్ సినిమాలతో కొంత మంది టెన్షన్ ని పక్కనెట్టి మంచి లాభాలను అందుకుంటున్నారు. పోతే వెంట్రుక వస్తే కొండ అన్నట్లు భయం లేకుండా ఓ 30 లక్షల వరకు డబ్బింగ్ సినిమాల కోసం ఖర్చు పెట్టేస్తున్నారు. విజయ్ దేవరకొండ ద్వారకా సినిమాను కూడా AN.బాలాజీ అనే కోలీవుడ్ నిర్మాత తక్కువ ధరకు కొనుక్కొని తమిళ్ లో ఏప్రిల్ 26న రిలీజ్ చేస్తున్నాడు. 

ఈ సినిమా తెలుగులో అంతగా ఆడలేదు. అయితే విజయ్ గీత గోవిందం హిట్ తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. నోటా సినిమాతో తమిళ్ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. దీంతో చీకట్లో రాయిలా అర్జున్ రెడ్డి టైటిల్ తో ద్వారకా సినిమాను తమిళ్ లో రిలీజ్ చేస్తున్నాడు. మరి ఆ సినిమా బాక్స్ ఆఫీస్ ని టచ్ చేస్తుందో లేదో? . ప్రస్తుతం అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ లో విక్రమ్ తనయుడు ధృవ్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.