ఈరోజు అప్డేట్స్: దేవరకొండ వాడకం అంటే ఇదీ.. రామ్ పోతినేని చేతుల మీదుగా ట్రైలర్, బిగ్ అప్డేట్ కి టిల్లు రెడీ
డీజే టిల్లు బ్లాక్ బస్టర్ కావడంతో ఆ చిత్రానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు.

విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' ట్రెండింగ్
స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా "ఫ్యామిలీ స్టార్". మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి రీసెంట్ గా టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుని సినిమా సక్సెస్ గ్యారెంటీ అనే నమ్మకాన్ని కలిగించింది. అటు ఫ్యామిలీ ఎమోషన్స్, ఎలిమెంట్స్, యాక్షన్, హీరోయిజం అన్నీ సినిమాలో ప్యాకేజ్ గా ఉన్నట్లు "ఫ్యామిలీ స్టార్" గ్లింప్స్ తో తెలిసింది. ఇక ఈ గ్లింప్స్ లోని 'ఐరెనే వంచాలా ఏంటి..?' డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ట్విట్టర్, ఇన్ స్టా, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా యాప్స్ లో ఈ డైలాగ్ వైరల్ అవుతోంది.
ఈ ట్రెండింగ్ చూసి అసలు 'ఇంటర్నెట్ లో ఏం నడుస్తుంది...?' అంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేశారు విజయ్. 'ఐరెనే వంచాలా ఏంటి...?' డైలాగ్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. విజయ్ దారినే నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ ఫాలో అయ్యింది. 'మేము కూడా ఈ మ్యాడ్ నెస్ లో భాగమవుతున్నాం..' అంటూ 'ఐరెనే వంచాలా ఏంటి...?' డైలాగ్ పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా కొందరు నెగిటివ్ గా ట్రోల్స్ చేసినా దాన్ని కూడా విజయ్ దేవరకొండ పాజిటివ్ గా తీసుకున్నారు. ఈ డైలాగ్ వైరల్ అవుతుండటంతో 'ఐరెనే వంచాలా ఏంటి...?' అనే స్పెషల్ పోస్టర్ చేయించి రిలీజ్ చేశారు మేకర్స్.
ఉస్తాద్ రామ్ పోతినేని విడుదల చేసిన 'దీపావళి' ట్రైలర్
అనగనగా ఓ మేక. దాని పేరు అబ్బులు! దేవుడికి మొక్కుకున్న మేక అది. ఆ మేక అంటే ఇంట్లో చిన్న పిల్లాడు గణేష్‌కు ప్రాణం. దాని తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళడు. అయితే... దీపావళికి కొత్త డ్రస్ వేసుకోవాలనే గణేష్ ఆశ మేకకు ముప్పు తిప్పలు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత ఏమైందనేది తెలుసుకోవాలంటే 'దీపావళి' సినిమా చూడాలి.
ప్రముఖ నిర్మాత, శ్రీ స్రవంతి మూవీస్ అధినేత 'స్రవంతి' రవికిశోర్ నిర్మించిన సినిమా 'దీపావళి'. కృష్ణ చైతన్య చిత్ర సమర్పకులు. ఆర్ఏ వెంకట్ దర్శకత్వం వహించారు. పూ రాము, కాళీ వెంకట్ ప్రధాన పాత్రధారులు. 'స్రవంతి' రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా 'కిడ'కు తెలుగు అనువాదం ఈ 'దీపావళి'. ఈ సినిమా పలు జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ప్రశంసలు అందుకుంది. నవంబర్ 11న తెలుగు, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ రోజు ఉస్తాద్ రామ్ పోతినేని ట్విట్టర్ ద్వారా ట్రైలర్ విడుదల చేశారు.
పల్లెటూరి నేపథ్యంలో 'దీపావళి' తెరకెక్కించారు. ట్రైలర్ చూస్తే... పల్లెలో పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలను సహజంగా ఆవిష్కరించారు. తాత, మనవడు, మేక మధ్య బంధాన్ని బలంగా చూపించారు. దీపావళి పండక్కి కొత్త డ్రస్ కొని ఇవ్వమని మనవడు అడగడంతో మేకను అమ్మడానికి తాతయ్య సిద్ధపడతాడు. మొక్కుబడి మేక కావడంతో ఊరి జనాలు దానిని కొనడానికి ముందుకు రారు. అయితే... కొత్తగా మటన్ షాప్ పెట్టుకోవాలని వీరబాబు ఆ మేక కొనడానికి రెడీ అవుతాడు. ఆ తర్వాత మేకను మరొకరు దొంగతనం చేస్తారు. తర్వాత ఏమైందనేది వెండితెరపై చూడాలి. మేకకు ప్రముఖ హాస్య నటుడు, కథానాయకుడు సప్తగిరి వాయిస్ ఇచ్చారు.
వేణు ఊడుగుల చేతుల మీదుగా 'ప్లాట్' ట్రైలర్
వికాస్ ముప్పాల, గాయత్రి గుప్తా, సాజ్వి పసల, సంతోష్ నందివాడ, కిషోర్ ప్రధాన పాత్రల్లో బి.బి.టి.ఫిల్మ్స్ బ్యానర్‌పై భాను భవ తారక దర్శకత్వంలో కార్తీక్ సేపురు, భాను భవ తారక, తరుణ్ విఘ్నేశ్వర్ సేరుపు నిర్మిస్తోన్న చిత్రం ‘ప్లాట్’. దర్శకుడు వేణు ఊడుగుల ముఖ్య అతిథిగా పాల్గొని ట్రైలర్‌ను విడుదల చేశారు.
డైరెక్టర్ వేణు ఊడుగుల మాట్లాడుతూ.. ‘ప్లాట్ టీం ఏడాది క్రితం నా వద్దకు వచ్చింది. పోస్టర్‌ను రిలీజ్ చేశాను. ఆ పోస్టర్ నాకు చాలా నచ్చింది. ఎంతో కొత్తగా, వైవిధ్యంగా ప్రయత్నించారు. ఇదొక ప్రయోగాత్మక చిత్రం. కారెక్టర్స్, క్యాస్టూమ్స్, మాటలు, శబ్దాలు ఎంతో సహజంగా అనిపించాయి. ట్రైలర్ చూస్తే కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లినట్టుగా అనిపిస్తోంది. భాను గురించి భవిష్యత్తులో అందరూ మాట్లాడతారు. ఫిల్మ్ మేకింగ్ మూమెంట్స్ వల్ల సినిమా పరిణామా క్రమం మారుతూ వచ్చింది. ఈ మూవీ ఇంకా అడ్వాన్స్‌గా ఉంటుందని అర్థం అవుతోంది. ఇలాంటి సినిమాలు థియేటర్లో ఆడితే ఇంకా కొత్తకథలు వస్తాయి. దర్శకనిర్మాతలు ప్రయోగాలు చేసేందుకు ముందుకు వస్తారు. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు, మీడియా ముందుండి సపోర్ట్ చేయాలి’ అని అన్నారు.
డైరెక్టర్ హర్ష మాట్లాడుతూ.. ‘ట్రైలర్ ఎంతో బాగుంది. బాగా కట్ చేశారు. ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉందో.. సినిమా కూడా అంతే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ మూవీ ఆల్రెడీ నేను చూశాను. కొత్త అనుభూతిని ఇస్తుంది. భాను ఈ మూవీ తరువాత మరోస్థాయికి వెళ్తాడు’ అని అన్నారు.డైరెక్టర్ ఉదయ్ మాట్లాడుతూ.. ‘ప్లాట్ మూవీ టీజర్, ట్రైలర్ బాగున్నాయి. ఇండిపెండెంట్ ఫిల్మ్‌ను ఎంతో ప్యాషన్‌తో చేశారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీశారు. ఇలాంటి సినిమాలు కమర్షియల్‌గా వర్కౌట్ అవ్వాలి. అప్పుడే ఇంకా కొత్త కథలు వస్తాయి. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
టిల్లు స్క్వేర్ నుంచి బిగ్ అప్డేట్
డీజే టిల్లు బ్లాక్ బస్టర్ కావడంతో ఆ చిత్రానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టిల్లన్నా ఇలాగైతే ఎలాగన్నా అనే సాంగ్ కి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సారి కూడా ఎంటర్టైన్మెంట్ ఏమాత్రం తగ్గదు అని భరోసా చిత్ర యూనిట్ ఇస్తోంది. అయితే తాజాగా టిల్లు స్క్వేర్ చిత్ర యూనిట్ ఆసక్తికర ప్రకటన చేసింది. శుక్రవారం అంటే రేపు ఉదయం 11:07 గంటలకు టిల్లు స్క్వేర్ చిత్రానికి సంబంధించిన బిగ్ అనౌన్స్మెంట్ ఉండబోతున్నట్లు ప్రకటించారు.