తమిళనాడులోని గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళ హీరో విజయ్ అభిమానులు మరణించారు. ఈరోడ్ జిల్లా పుంజైపులియాంపట్టిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సత్యమంగళంకి చెందిన ముత్తుకుమార్ తనయుడు దినేష్ కుమార్(18), కోవైశరవణన్‌పట్టిలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు.

అదే ప్రాంతానికి చెందిన అబుకర్ కుమారుడు శక్తి(18) కూడా ఇంజనీరింగ్ చదువుతున్నాడు. వీరిద్దరూ విజయ్ అభిమానులు కావడంతో ఆయన నటించిన 'సర్కార్' సినిమా చూడడం కోసం గత రాత్రి 'సర్కార్' సినిమా నైట్ షోకి వెళ్లారు.

సినిమా పూర్తయిన తరువాత బైక్ మీద ఇంటికి తిరుగుముఖం పట్టారు. పుంజైపులియాంపట్టి మార్గంలో వస్తుండగా.. బైక్ అదుపుతప్పి ఎదురుగా వస్తోన్న లారీనీ ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృత దేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ నీలకంఠంను అరెస్ట్ చేశారు.