ఇండియన్ సూపర్ హీరో హృతిక్ రోషన్ నటించిన 'సూపర్ 30 చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. వికాస్ బెహల్ ఈ చిత్రానికి దర్శకుడు. పేద విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలనే ఆశయంతో బీహార్ కు చెందిన గణితవేత్త ఆనంద్ సూపర్ 30 అనే కోచింగ్ సెంటర్ ప్రారంభించారు. 

ఆయన జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. హృతిక్ రోషన్ అద్భుతమైన నటనతో ఈ చిత్రం ఘనవిజయం దిశగా అడుగులు వేస్తోంది. సందేశాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఉపరాష్ట్రపతి భవన్ లో వెంకయ్య నాయుడుకి చిత్ర యూనిట్ స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చిత్రాన్ని చూసిన వెంకయ్య నాయుడు చిత్ర యూనిట్ పై ప్రశంసలు జల్లులు కురిపించారు. సూపర్ 30 చిత్రం తన హృదయాన్ని కదిలించిందని వెంకయ్య నాయుడు తెలిపారు. 

సూపర్ 30 చిత్రాన్ని హృతిక్ రోషన్ తో కలసి చూసినందుకు చాలా సంతోషిస్తున్నా. ఎంతో మంది విద్యార్థుల జీవితాల గురించి ఆలోచించిన ఉపాధ్యాయుడు ఆనంద్ జీవితాన్ని వెండితెరపైకి తీసుకురావడం అభినందించదగ్గ విషయం అని వెంకయ్య నాయుడు ప్రశంసించారు. ఈ సందర్భంగా వెంకయ్యతో కలసి ఉన్న ఫోటోలని హృతిక్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.