వెన్నెల కిషోర్ మంచి ఫామ్ లో ఉన్నారు. ఆయన చేస్తున్న పాత్రలన్ని క్లిక్ అవటమే కాదు..మంచి క్యారక్టర్స్ సైతం వెతుక్కుంటూ వస్తున్నాయి. తాజాగా ఆయన  నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘యన్‌.టి.ఆర్‌’లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారట. మొదటి భాగం ‘కథానాయకుడు’లో వెన్నెల కిషోర్ పాత్ర కనిపిస్తుందని సమాచారం. బాలయ్యకు తెరపై బావమరిదిగా,మేనేజర్ గా కనిపించనున్నారు వెన్నెల కిషోర్. ఆయన పోషిస్తున్న క్యారక్టర్  రుక్మనంద రావు.

ఎవరీ  రుక్మనంద రావు అంటే.. అప్పట్లో  నందమూరి తారక రామారావుకి  మేనేజర్..అంతే కాదు.. ఆయన భార్య బసవతారకం సోదరుడు కూడా. అంటే బావమరిది కూడా. అంటే నిజ జీవితంలో బాలకృష్ణకు మామయ్య అన్నమాట.  సినిమాలో బాలకృష్ణ, వెన్నెల కిషోర్ కు మధ్య చాలా ముఖ్యమైన సీన్స్  ఉన్నాయట.

‘యన్‌.టి.ఆర్‌’బయోపిక్ గా రూపొందుతున్న ఈ  సినిమాకు క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వి.ఎస్‌ జ్ఞానశేఖర్ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎమ్‌.ఎమ్‌ కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ బయోపిక్‌ను రెండు భాగాలుగా తీర్చిదిద్దుతున్నారు. 

పుట్టక నుంచి రాజకీయ రంగ ప్రవేశం వరకూ ‘కథానాయకుడు’గా రాబోతోంది. అక్కడి నుంచి అంతిమ ఘడియల వరకూ ‘మహానాయకుడు’లో చూపించబోతున్నారు. తొలి భాగాన్ని వచ్చే ఏడాది జనవరి 9న, రెండో భాగాన్ని జనవరి 24న విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఇందులో ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకంగా విద్యా బాలన్‌, నారా చంద్రబాబు నాయుడుగా రానా, హరికృష్ణగా కల్యాణ్‌రామ్, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్‌, జయప్రదగా హన్సిక, జయసుధగా పాయల్‌ రాజ్‌పుత్‌ కనిపించనున్నారు.

ఇక  ఈ సినిమాలోని ‘కథానాయకుడు..’ అనే పాటను ఆదివారం ఉదయం 7.42 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ శనివారం ప్రకటించింది. సరికొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.|