మలయాళంలో మోహన్‌లాల్‌, మీనా నటించిన `దృశ్యం` ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమా తెలుగులో `దృశ్యం`గా, తమిళంలో `పాపనాశం`గా రీమేక్‌ అయి విజయం సాధించింది. అలాగే కన్నడ, హిందీలోనూ రీమేక్‌ అయ్యి ఆకట్టుకుంది. తెలుగు రీమేక్‌లో వెంకటేష్‌, మీనా జంటగా నటించిన విషయం తెలిసిందే. తాజాగా మలయాళంలో మోహన్‌లాల్‌, మీనా జంటగా `దృశ్యం2` రూపొంది శుక్రవారం విడుదలై పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతుంది. మొదటి చిత్ర దర్శకుడు జీతూ జోసెఫ్‌ ఈ సీక్వెల్‌ని రూపొందించి హిట్‌ కొట్టాడు. 

దీంతో ఈ సీక్వెల్‌ రీమేక్‌పై చర్చ మొదలైంది. తెలుగులో వెంకీ చేస్తారా? లేదా? అనే చర్చ ఇన్నాళ్లు జరుగుతూ వచ్చింది. తాజాగా మలయాళ సినిమాకి హిట్‌ టాక్‌ రావడంతో వెంకీ కూడా తెలుగు రీమేక్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని తెలుస్తుంది.అయితే మాతృక దర్శకుడు జీతూ జోసెఫ్‌ డైరెక్షన్‌లోనే ఈ సినిమా చేయాలని భావిస్తున్నారట వెంకీ. సురేష్‌ ప్రొడక్షన్‌ నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టు టాక్‌. మరి ఇందులో నిజమెంతా అనేది అధికారికంగా ప్రకటిస్తేనే తెలుస్తుంది.

ప్రస్తుతం వెంకటేష్‌ `నారప్ప` చిత్రంలో నటిస్తున్నారు. ఇది మే 14న విడుదల కానుంది. దీంతోపాటు తన బ్లాక్‌ బస్టర్‌ సీక్వెల్‌ `ఎఫ్‌3`లో వరుణ్‌ తేజ్‌తో కలిసి నటిస్తున్నారు. ఇది ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. `ఎఫ్‌2` కాంబినేషన్‌లోనే ఈ సినిమా రూపొందుతుంది. తమన్నా, మెహరీన్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా, అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌రాజు నిర్మిస్తున్నారు.