నెక్ట్స్ వరల్డ్ కప్ మనదే.. రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీలపై వెంకటేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్..
ఆదివారం జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. దీనిపై వెంకటేష్ స్పందించారు. తన సినిమా ఈవెంట్‌లో ఆయన రియాక్ట్ అవుతూ అందరిచేత వాహ్ అనిపించారు.

వరల్డ్ కప్‌లో టీమిండియా పరాజయాన్ని చవిచూసింది. ప్రారంభం నుంచి ఓటమి లేకుండా ఆడిన భారత క్రికెట్ జట్ట్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా ముందు చతికల పడింది. 2003 నాటి పరిస్థితి రిపీట్ అయ్యింది. దీంతో భారత క్రికెట్ అభిమానులంతా నిరాశలో ఉన్నారు. అంతేకాదు ఈ మ్యాచ్‌ని సినిమా సెలబ్రిటీలు చాలా మంది ప్రత్యక్షంగా స్టేడియం నుంచి వీక్షించారు. అందులో వెంకటేష్ కూడా ఒకరు. ఆయన చాలా వరకు క్రికెట్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా స్టేడియంలో వీక్షించారు.
తాజాగా టీమిండియాపై వెంకటేష్ స్పందించారు. తాజాగా ఆయన `సైంధవ్` చిత్రంలో నటించిన నేపథ్యంలో ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా `రాంగ్ యూసేజ్` అనే పాటని విడుదల చేశారు. వీఎన్‌ఆర్, వీజేఐఈటీ కాలేజ్‌లో ఈ పాట విడుదల కార్యక్రమం జరిగింది. ఇందులో వెంకటేష్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడే ముందు పలు సరదా సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. వెంకటేష్ మాట్లాడేందుకు స్టేజ్‌పైకి రావడంతో స్టూడెంట్స్ అంతా హోరెత్తించారు. దీనికితోడు వెంకీ సైతం వారిలో జోష్ నింపేలా మాట్లాడారు.
మొదట ఆయన టీమిండియా క్రికెట్ జట్టుపై ఆయన ప్రశంసలు కురిపించారు. వరల్డ్ కప్ మిస్ అయినప్పటికీ భారత్ అద్భుతమైన ప్రదర్శన చేసిందన్నారు. ప్రారంభం నుంచి అద్భుతంగా ఆడిందని చెప్పారు. కప్ రాకపోయినా అంతకంటే బాగా టీమిండియా క్రికెటర్లు మంచి ప్రదర్శన ఇచ్చారని చెప్పారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, షష్మి, బూమ్రా, శ్రేయాష్, సూర్యకుమార్ ఇలా అందరికి ఆయన అభినందనలు తెలిపారు. అద్భుతంగా ఆడారని ఖితాబిచ్చారు. అంతేకాదు స్టూడెంట్స్ చేత వారికి క్లాప్స్ కొట్టించారు వెంకీ. ఇప్పుడు మిస్ అయినా, నెక్ట్స్ వరల్డ్ కప్ మనదే పక్కా అంటూ అందరిలో ఉత్సాహాన్ని నింపారు. ఎనర్జీని తీసుకొచ్చారు.
ఇక ఇందులో `సైంధవ్` చిత్రం గురించి మాట్లాడుతూ, ఇది రెగ్యూలర్ `ఢంకటక` మూవీ కాదన్నారు. యాక్షన్ నెక్ట్స్ లెవల్‌లో ఉంటుందని, వాహ్ అనిపించే యాక్షన్ ఎలిమెంట్స్, సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయని చెప్పారు. మంచి కాన్సెప్ట్ ని ఈ చిత్రంలో చూపించబోతున్నట్టు తెలిపారు. అయితే ఈ సందర్భంగా స్టూడెంట్స్ ని టీజ్ చేశాడు వెంకీ. తన మొదటి సినిమా విడుదలైనప్పుడు మీరు ఇంకా పుట్టనే లేదని, అప్పుడు మీ పేరెంట్స్ ఉన్నారని, వాళ్లు అదరించారని, ఇప్పుడు మీరు కూడా నా సినిమాలు చూస్తున్నారని తెలిపారు.
ఇటీవల నేను నటించిన `ఆడవారి మాటలకు అర్థాలే వేరులే`, `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` చూసి ఉంటారు, ఎందుకంటే అందులో మహేష్ ఉన్నాడు కాబట్టి, అలాగే `గోపాల గోపాల` చూసి ఉంటారని ఎందుకంటే అందులో పవన్ ఉన్నాడు కాబట్టి అంటూ స్టూడెంట్స్ ని హోరెత్తించేలా మాట్లాడారు వెంకీ. ఇతర హీరోలపై ప్రశంసలు కురిపిస్తూ వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అందుకే మీరంటే ఇష్టం మాకు అని వారి చేత అనిపించుకున్నాడు వెంకీ. అంతేకాదు ఆయన స్టేజ్‌పై డాన్సులు చేస్తూ ఉర్రూతలూగించారు.