విక్టరీ వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా నటించిన `ఎఫ్‌2`(ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌) చిత్రం భారీ విజయాన్ని సాధించింది. గతేడాది సంక్రాంతికి విడుదలై వందకోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టి అందరిని షాక్‌కి గురి చేసింది. అనిల్‌ రావిపూడి మ్యాజిక్‌కి, సంక్రాంతి సీజన్‌ కలిసి రావడంతో సినిమా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. 

దీనికి సీక్వెల్‌ని రూపొందిస్తున్నట్టు గతంలో వార్తలు వినిపించాయి. `ఎఫ్‌3` పేరుతో ఈ సినిమాని తెరకెక్కించనున్నట్టు, మరింత ఫన్‌తో సినిమాని రూపొందించబోతున్నట్టు వార్తలు వినిపించాయి. తాజాగా ఈ విషయాన్ని హీరో వెంకటేష్‌, చిత్ర నిర్మాత దిల్‌రాజు అధికారికంగా ప్రకటించారు. నేడు(ఆదివారం) వెంకటేష్‌ పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ విషయాన్ని వెల్లడించారు. 

`ఎఫ్‌2`ని భార్యా భర్తల మధ్య మనస్పార్థాలు, అర్థం చేసుకునే విషయంలో వచ్చే తేడాలు, పెళ్ళికి ముందున్న ఆలోచనలు, పెళ్లి తర్వాత వచ్చే ఇబ్బందులు, ఈ సందర్భంగా పుట్టే ఫన్‌ ప్రధానంగా రూపొందించారు. తాజాగా `ఎఫ్‌3`ని డబ్బుల వల్ల వచ్చే సమస్యలు, దీని వల్ల పుట్టే ఫన్‌ ప్రధానంగా తెరకెక్కించనున్నట్టు దర్శకుడు అనిల్‌ రావిపూడి తెలిపారు. ఇందులో కూడా వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌, తమన్నా, మెహరీన్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నట్టు తెలిపారు. మరి మరో హీరో ఎవరు అన్నది సస్పెన్స్ నెలకొంది.