వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఏఎన్నార్ విగ్రహావిష్కరణ.. నాగార్జునకి ఎమోషనల్ మూమెంట్
తెలుగు నటనా శిఖరం అక్కినేని నాగేశ్వర రావు శతజయంతి నేటి నుంచి మొదలైంది. దీనితో ఏఎన్నార్ తనయుడు, కింగ్ నాగార్జున తన తండ్రి శతజయంతి ఉత్సవాలని వైభవంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.

తెలుగు నటనా శిఖరం అక్కినేని నాగేశ్వర రావు శతజయంతి నేటి నుంచి మొదలైంది. దీనితో ఏఎన్నార్ తనయుడు, కింగ్ నాగార్జున తన తండ్రి శతజయంతి ఉత్సవాలని వైభవంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. నేడు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్నార్ విగ్రహావిష్కరణతో శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు.
ప్రేమ చిత్రాలలో ఏఎన్నార్ శైలి ప్రత్యేకమైనది. దేవదాసు, ప్రేమనగర్ లాంటి ట్రాజిడీ చిత్రాలతో ఏఎన్నార్ నట విశ్వరూపం ప్రదర్శించారు. దసరా బుల్లోడుగా అలరించారు. నవరసాలని అత్యద్భుతంగా పలికించాలగల అరుదైన నటుల్లో ఏఎన్నార్ ఒకరు. అలాంటి ఏఎన్నార్ పంచలోహ విగ్రహావిష్కరణ వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది.
వెంకయ్య నాయుడు ఏఎన్నార్ విగ్రహాన్ని ఆవిష్కరించే సమయంలో నాగార్జున ఎమోషనల్ అయ్యారు. పుష్పలు అర్పించి తన తండ్రికి నివాళులు అర్పించారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. విగ్రహం ఎంతో అందంగా ఉంది. ఈ కార్యక్రమానికి సుమ వ్యాఖ్యాతగా వివహరించడం విశేషం.
ఏఎన్నార్ కృష్ణ జిల్లా రామాపురం అనే చిన్న గ్రామంలో జన్మించిన సంగతి తెలిసిందే. 1924 సెప్టెంబర్ 20న అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ అనే దంపతులకు ఏఎన్నార్ జన్మించారు. 2014 జనవరి 22న ఏఎన్నార్ తుదిశ్వాస విడిచారు. దాసాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మవిభూషణ్ లాంటి ప్రఖ్యాత అవార్డులు ఏఎన్నార్ నటన నైపుణ్యానికి, కళా సేవకు దాసోహం అయ్యాయి.
తెలుగు సినిమా హైదరాబాద్ తరలిరావడంతో కీలక పాత్ర పోషించిన లెజెండ్ ఏఎన్నార్ అని చెప్పడంలో సందేహం లేదు. ఎన్టీఆర్ తో విభేదించినప్పటికి ఆయన్ని తన ప్రాణ మిత్రుడిగానే భావిస్తారు ఏఎన్నార్. ఇద్దరూ కలసి పదుల సంఖ్యలో చిత్రాల్లో నటించారు. గుండమ్మ కథ, మాయాబజార్ చిత్రాల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ లని చూస్తూ ఇప్పటికి అభిమానులు మురిసిపోతూనే ఉంటారు.