-----సూర్య ప్రకాష్ జోశ్యుల

ఆ మధ్యన చిన్న స్టార్స్ ని కూడగట్టుకుని మల్టిస్టారర్ అంటూ శమంతక మణి చిత్రం వచ్చి వెళ్లిపోయింది.  ఆ సినిమా కంటెంట్ ఎలా ఉన్నా, కమర్షియల్ గా ఎలా పే చేసినా కష్టపడి తీశారని  అర్దమయ్యేలా కనపడింది. పాజిటివ్ బజ్ రాబట్టుకోకపోయినా నెగిటివ్ టాక్ తెచ్చుకోలేదు. అయితే ఇప్పుడు దాదాపు అలాంటి కాంబినేషన్ తోనే  'వీరభోగ వసంత రాయులు' అంటూ ఓ క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కి మన ముందుకు వచ్చింది. టైటిల్ చూడగానే వెరైటిగా ఉందని, ట్రైలర్ చూసి వింతగా ఉందని మాట్లాడుకునేలా  చేసిన ఈ సినిమా  చూస్తే ఎలా అనిపించింది. టైటిల్ కు కథకు సంబంధం ఏమిటి.. కాలజ్ఞానం కాలంలో కథ ఏమన్నా జరుగుతుందా...నారా రోహిత్, శ్రీ విష్ణు,సుధీర్ బాబులలో హీరో ఎవరు.. వసంతరాయులు ఎవరో రివ్యూలో చూద్దాం.

కాలజ్ఞానం ప్రకారం... ఊరి పొలిమేరల్లో (సరిహద్దులలో ) తెల్లని కాకులు ఏడ్చే సమయాన వీర భోగ వసంత రాయలు తన భక్తులకు దర్శనమిస్తాడు. మరి ఈ వీర భోగ వసంతరాయులు?

స్టోరీ లైన్: 

క్రైమ్ థ్రిల్లర్ కాబట్టి ట్విస్ట్ లు రివీల్ చేసేలా ఈ కథను పూర్తి విసిదంగా రాయటం కుదరదు (చూద్దామనుకునేవాళ్ళకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి) . ఉన్నంతలో కథ అర్దమయ్యేలా చెప్తాను.

పారలల్ గా సాగే మూడు సబ్ ప్లాట్స్ తో కథ మొదలవుతుంది. మెయిన్ ప్లాట్.. ఇండియన్ క్రికెటర్స్‌ తో పాటు చాలా మంది సెలబ్రెటీలు ప్రయాణిస్తున్న ఓ విమానం హైజాక్‌కు గురవుతుంది. నెక్ట్స్ ప్లాట్  చూస్తే.. అదే సమయంలో సిటీలో వరుసగా అనాథ పిల్లల కిడ్నాప్‌లు సంచలనంగా మారతాయి. ఇక మూడో ప్లాట్ లో ఓ కుర్రాడు తన ఇళ్లు ఎక్కడో తప్పిపోయిందంటూ పోలీసు కంప్లయింట్ ఇస్తాడు.

ఈ మూడు కేసులను తేల్చటానికి ముగ్గురు స్పెషల్ ఇన్విస్టిగేంటింగ్ ఆఫీసర్స్ ని నియమిస్తారు. వాళ్లు దీపక్ రెడ్డి (నారా రోహిత్), నీలిమ(శ్రియ), వినయ్ (సుధీర్ బాబు).  ఈలోగా హైజాకర్.. తను వీరభోగవసంతరాయులు(శ్రీ విష్ణు)ని అని  ... తన దగ్గర ఉన్న 300 మంది బంధీలను విడుదల చెయ్యాలంటే  అంతే సంఖ్యలో నేరస్తులను ప్రభుత్వం చంపేయాలని డిమాండ్‌ చేస్తాడు. మరి గవర్నమెంట్ ఆ డిమాండ్ ఓకే చేసిందా..ఈ సబ్ ప్లాట్ లకు హైజాక్ మెయిన్ ప్లాట్ కు లింకేంటి. ఈ ఇన్విస్టిగేంటింగ్ అధికారులు ఎలా ఈ కేసుని చేదిస్తారు. వీరభోగవసంతరాయులు ఎవరు..? అతని గతం ఏమిటి..? ఈ కేసులకు అతనికి లింకేంటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది..

ఓ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉండకూడదో అలా ఉంది ఈ సినిమా నేరేషన్. అబ్ స్టాక్ట్ గా ప్రారంభమై మొదటి పదినిముషాలు ఆసక్తి లేపిన ఈ చిత్రం ఆ తర్వాత చూసే శక్తి కూడా లేనంత నీరసపరిచింది. పూర్తిగా చుట్టేసినట్లున్న ఈ సినిమాలో సన్నివేశాలు షార్ట్ ఫిలిం స్టాండర్డ్స్ ని కూడా మ్యాచ్ కావు. సీన్ సీన్ కీ సీన్ లోకి ..హీరోలు ఒకరి తర్వాత మరొకరు వస్తూంటారు.. కథ అర అంగుళం కూడా ముందుకు కదలదు. అలాగే ప్రతీ సన్నివేశం ..ఊహకు అందేటట్లే డిజైన్ చెయ్యబడి ఉంటుంది. క్రైమ్ థ్రిల్లర్ కు తగినట్లుగా ఎక్కడా కథలో టెన్షన్ కానీ టెంపోకానీ  వేరియేషన్ కూడా కనపడదు. వీర భోగ వసంతరాయులు టైటిల్ చూసి టెమ్ట్ అయ్యి  ఓ కథ రాసుకున్నట్లు అనిపిస్తుంది కానీ ఎక్కడా కథకు, టైటిల్ సింక్  ఉన్నట్లు కనపడదు. 

డబ్బాలో రాళ్ళేసినట్లే ..డబ్బింగ్    

సినిమాలో ఎక్కువ సేపు కనపడే క్యారక్టర్ సుధీర్ బాబు. అతనికి డబ్బింగ్ ఎవరో చెప్పారు. ఆ డబ్బింగ్ కూడా అసలు కుదరలేదు. దాంతో తెరపై సుధీర్ బాబు ఉన్న ఫీల్ రాదు. శ్రియ, నారా రోహిత్ ల పాత్రలు చాలా చిన్నవి. వాటి గురించి మాట్లాడేంత విషయం లేదు.  శ్రీ విష్ణు గెటప్ అయితే ఎందుకంత వింతగా ఉంటాడనే మిస్టరీ ..సినిమా పూర్తైనా వీడదు. 

ముందే రిజల్ట్ ఊహించారేమో

వాస్తవానికి కొత్తగా దర్శకులుగా పరిచయం అయ్యే చాలా మంది  తమ ప్రతిభను మొత్తం ప్రూవ్ చేసుకోవటానికి తొలి సినిమానే ఏకైక అవకాసం అన్నట్లు ఫీలవుతారు. అదే ఈ దర్శకుడులోనూ కనిపించింది. ఏదో చెప్పాలని తాపత్రయం కనిపిస్తూంటుంది. అదేమీ తెరపై ఎగ్జిక్యూట్ కాక కంగాళిగా తయారువుతుంది. టెక్నికల్ టీమ్ కూడా అలాగే సెట్ అయ్యింది. లేకపోతే వాళ్లు ముందే ఈ సినిమా రిజల్ట్ ని ఊహించరేమో...ఎవరూ మనస్సు పెట్టి చేసినట్లు అనిపించదు. ముఖ్యంగా ఈ సినిమా చూస్తూంటే ..ఎడిటర్ పై కోపం వస్తుంది. ఆయన కాస్త ఇంట్రస్ట్ గా చేస్తే...మరీ అంత విసుగెత్తించకపోదు కదా అనిపిస్తుంది. అయితే ఎడిటర్ అయినా మరొకరు అయినా దర్శకుడు మాట వినాల్సిందే కదా.

ఫైనల్ థాట్

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం ప్రకారం  వీరభోగ వసంత రాయులు ఈ యుగంలో అవతరిస్తాడని విశ్వాసం. ఆయన వచ్చేలోగా వెండి తెరపై ఈ వీరభోగ వసంత రాయులు తన భోగం ఒలకపోస్తూ దిగారు. అయితే వీరత్వం,విషయం లేని ఆయన భోగం అట్టే కాలం నడవదని అర్దమైపోయింది. ఇంత నాసిరకంగా కూడా ఈ రోజుల్లో  సినిమాలు స్టార్స్ అప్పుడప్పుడూ తీస్తూంటారని చెప్పటానికే ఈ అవతారం వెండితెరపై అవతరించిందని మనకు అవగాహనకి రావటానికి ఈ సినిమా వచ్చిందేమో అనిపిస్తుంది. 

రేటింగ్:  1/5 

నటీనటులు : సుధీర్‌ బాబు, నారా రోహిత్, శ్రీ విష్ణు, శ్రియ తదితరులు

సంగీతం : మార్క్‌ కె రాబిన్‌

కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ఆర్‌ ఇంద్రసేన

నిర్మాత : అప్పారావు బెల్లన