గత ఏడాది సైరా చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే చిత్రం చేస్తున్నారు. కరోనా తో వచ్చిన గ్యాప్ తో తన తర్వాత ప్రాజెక్టులు ఆయన ఓకే చేస్తున్నారు. మొదట మలయాళం మూవీ 'లూసీఫర్' రీమేక్ లో నటిస్తున్నట్టుగా చిరంజీవి వెల్లడించారు. అయితే ఈ సినిమా కంటే ముందు తమిళ్ లో మంచి హిట్ అయిన వేదాళం రీమేక్ లో చిరు నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.

2015లో అజిత్ హీరోగా వచ్చిన ఈ సినిమా భారీ హిట్ అయింది.. ఇందులోని అజిత్ మాస్ రోల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ రోల్ తనకి బాగా సూట్ అవుతుందని భావించిన చిరు ఈ రీమేక్ లో చేసేందుకు సిద్దం అయ్యారట. అందులో భాగంగానే ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోందని తెలుస్తోంది. ఈ సినిమా అన్న, చెల్లెలు అనుబంధం చుట్టూ తిరుగుతుంది. కాబట్టి చెల్లి పాత్ర కూడా కీలకమే. దాంతో ఈ సినిమాలో చెల్లి పాత్రకు గానూ సాయి పల్లవిని ఎంపిక చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఈ మేరకు ఆయన కొన్ని మార్పులు , చేర్పులతో స్క్రిప్టు వర్క్ చేయిస్తున్నారట.

తమిళ సూపర్ స్టార్ తల అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం అప్పట్లో పెద్ద హిట్. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తొలి వారంలోనే రూ.45కోట్లకు పైగా వసూలు చేసి సౌత్ సినిమా స్టామినాను మరోసారి ప్రూవ్ చేసింది. లాంగ్ రన్ లో  వంద కోట్లు వసూలు చేసిన 'వేదలం' సినిమాపై టాలీవుడ్ హీరోల కన్నుపడింది. మొదట ఆ సినిమాని పవన్ తో చేద్దామనుకున్నారు. ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎస్.ఐశ్వర్య నిర్మించనున్న ఈ చిత్రానికి ఆర్.టి.నేసన్ దర్శకుడుగా ఎంపిక చేసారు. విజయదశమి సందర్భంగా సంస్థ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభమైందీ చిత్రం. అయితే రకరకాల కారణాలతో వర్కవుట్ కాలేదు.  

అయితే ఇప్పుడు అదే సబ్జెక్టుని మెగాస్టార్ చేద్దామని ఆలోచిస్తున్నారట. అందులో భాగంగా స్క్రిప్టుని  మెహర్ రమేష్ తో రెడీ చేయిస్టున్నట్లు చెప్తున్నారు. చిరు ఇమేజ్‌కి తగ్గట్టు ‘వేదాళం’ కథలో మార్పులు చేస్తున్నారట దర్శకుడు మెహర్ రమేష్ అంటూ వార్తలు వచ్చాయి. సరైన కథ ఉంటే బిల్లా వంటి హిట్ ఇస్తారని మెహర్ రమేష్ ని చిరంజీవి నమ్మి ఈ ప్రాజెక్టు అప్ప చెప్పబోతున్నారని చెప్పుకున్నారు.
 
ఈ సినిమాను కె ఎస్ రామారావు నిర్మించానున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌లో తెరకెక్కే అవకాశం ఉంది. ఒకవేళా అలా జరగని పక్షంలో రామ్ చరణ్ సొంతంగా తన కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మించనున్నారట.