మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం 'అంతరిక్షం'. మొన్న శుక్రవారం విడుదలైన ఈ సినిమా  డివైడ్ టాక్  వచ్చింది. రివ్యూలు గొప్పగా రాలేదు. దాంతో కలెక్షన్స్ సైతం అంతంతమాత్రంగానే  ఉన్నాయి.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం రిజల్ట్ గురించి మీడియా తో మాట్లాడింది చిత్రం టీమ్.

వరుణ్ తేజ్ మాట్లాడుతూ... ‘‘మా సినిమాకి ఎక్కువ డబ్బు రాదని తెలుసు.  అందుకే తక్కువ బడ్జెట్లో సినిమాను రూపొందించాం.  ఇదొక ప్రయోగాత్మక చిత్రం.  విఎఫ్ఎక్స్ కోసం ఇంకో 10 కోట్లు ఖర్చు పెట్టి ఉంటే సినిమా ఇంకా బాగుండేది అన్నారు.  సినిమాపై వచ్చిన విమర్శలు స్వీకరిస్తున్నాం. అలాంటి పొరపాట్లు జరక్కుండా జాగ్రత్త పడతాం. విభిన్న   చిత్రంగా మా శ్రమకు గుర్తింపు వచ్చింది’’అన్నారు వరుణ్‌తేజ్‌.

ఇక  దర్శకుడు సంకల్ప్ రెడ్డి సైతం మిశ్రమ స్పందనపై మాట్లాడుతూ...  ‘‘ఈ ఫలితం భవిష్యత్తులో ఇంకాస్త కష్టపడాలనే భావం కలిగిస్తోంది.  మనకున్న  బడ్జెట్‌లో ఎలాంటి సినిమా అయినా తీయగలమన్న భరోసా ఇచ్చిన విజయమిది. కొన్ని లాజిక్కులు మిస్సయ్యాం. అవన్నీ ఆలోచించి తీస్తే ఇది డాక్యుమెంటరీలా తయారయ్యేది’’ అన్నారు.

నిర్మాత క్రిష్ మాట్లాడుతూ...‘‘సరికొత్త సినిమా చూస్తున్న అనుభూతి కలిగించింది ‘అంతరిక్షం’. ‘గమ్యం’, ‘కంచె’ తరవాత మా సంస్థ నుంచి వచ్చిన మరో మంచి చిత్రంగా మిగిలిపోయింది’’ అన్నారు.