మెగా ఫ్యామిలీ హీరోలకు ఇటీవల కరోనా సోకిన విషయం తెలిసిందే. రామ్‌చరణ్‌ తనకు కరోనా అని ప్రకటించారు. ఆ వెంటనే వరుణ్‌ తేజ్‌ తనకు కరోనా సోకినట్టుగా ప్రకటించారు. దీంతో మెగా అభిమానులు, మెగా ఫ్యామిలీ మొత్తం ఉలిక్కి పడింది. మెగా హీరోలంతా కలిసి క్రిస్మస్‌ వేడుకలో పాల్గొన్నారు. దీంతో మిగిలిన వారికి కూడా సోకే అవకాశం ఉందని ఆందోళన చెందారు. కానీ ఈ ఇద్దరికే పరిమితమైంది. 

తాజాగా తనకు నెగటివ్‌ వచ్చిందని వరుణ్‌ తేజ్‌ ప్రకటించారు. జీవితంలో నెగటివ్‌ రిపోర్ట్ వస్తే ఇంత ఆనందం ఉంటుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు. `నెగటివ్‌ అని చెప్పే నివేదిక నాకు చాలా ఆనందాన్నిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఎస్‌, పరీక్షలో నాకు కరోనా నెగటివ్‌ అని తేలింది. నా కోసం ప్రార్థించి, ప్రేమని పంచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు` అని వరుణ్‌ చెప్పారు. 

ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌ `ఎఫ్‌3`లో నటిస్తున్నారు. రెండేళ్ల క్రితం వచ్చిన `ఎఫ్‌2`కిది సీక్వెల్‌. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా, వెంకటేష్‌ మరో హీరోగా, తమన్నా, మెహరీన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీంతోపాటు బాక్సింగ్‌ నేపథ్యంలో మరో సినిమా చేస్తున్నారు వరుణ్‌.