వరుణ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకి టైటిల్‌ ఖరారు చేశారు. `గని` అనే శక్తివంతమైన పేరుని ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. కిరణ్‌ కొర్రపాటి అనే నూతన దర్శకుడు దీన్ని రూపొందిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన `గని` చిత్ర మోషన్‌ పోస్టర్‌లో వరుణ్‌ తేజ్‌ బాక్సర్‌గా కనిపిస్తున్నారు. ఇది బాక్సింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమనే విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితమే ఈ సినిమాని ప్రకటించారు. బాక్సర్‌గా లుక్‌ కోసం చాలా రోజులు వరుణ్‌ కష్టపడ్డారు. ఇక తాజాగా విడుదల చేసిన బాక్సర్‌ లుక్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 

అల్లు అరవింద్‌ సమర్పణలో అల్లు వెంకటేష్‌, సిద్ధు ముద్దా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నేడు(మంగళవారం) వరుణ్‌ తేజ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించడంతోపాటు మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. `ముకుందా` చిత్రంతో హీరోగా పరిచయం అయిన వరుణ్‌ తేజ్‌ `కంచె`, `ఫిదా`, `తొలిప్రేమ`, `ఎఫ్‌2` చిత్రాలతో విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం ఆయన `గని` సినిమాతోపాటు `ఎఫ్‌3` సీక్వెల్‌లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఇది షూటింగ్‌ జరుపుకుంటోంది.