రెండేళ్ల క్రితం వచ్చిన `ఎఫ్‌2` సూపర్‌ హిట్‌గా నిలిచింది. సంక్రాంతి కానుకగా విడుదలై, ఊహించని విధంగా వంద కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. తాజాగా ఈ సినిమాకి సీక్వెల్‌ని రూపొందిస్తున్నారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా నటిస్తుండగా, తమన్నా, మెహరీన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దిల్‌రాజు తన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. తాజాగా సంక్రాంతి విషెస్‌ తెలియజేస్తూ ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్ ని విడుదల చేశారు. 

ఇందులో వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ రెండు వైపులు గొడుగుని రివర్స్ చేసి అందులో డబ్బు నోట్లతో నవ్వుతూ కనిపిస్తున్నారు. పై నుంచి నోట్లు పడుతుండగా, వాళ్లు గొడుల్లో పట్టుకుంటున్నట్టుగా ఉన్న ఈ నయా పోస్టర్‌ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ సినిమా డబ్బు ప్రధానంగా సాగుతున్నట్టు తెలుస్తుంది. డబ్బుతో వచ్చే ఇబ్బందులు, దాని వల్ల పుట్టే కామెడీ ప్రధానంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు అనిల్‌ రావిపూడి తెలిపారు. అందుకు తగ్గట్టే కొత్త పోస్టర్‌ని డిజైన్‌ చేయడంతో మరింత ఇంట్రెస్ట్ క్రియేట్‌ అవుతుంది. ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌ డబుల్‌ డోస్‌ అనేలా ఉంటుందట ఈ సినిమా. 

ఇప్పటికే వెంకటేష్‌ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనగా, ఇటీవల కరోనా నుంచి కోలుకున్న వరుణ్‌తేజ్‌ షూటింగ్‌లో జాయిన్‌ అయ్యారు. షూటింగ్‌ ఫన్నీగా సాగిందని తెలిపిన విషయం తెలిసిందే. ఈ కొత్త పోస్టర్‌ని వరుణ్‌ తేజ్‌, దర్శకుడు అనిల్‌రావిపూడి, చిత్ర నిర్మాత పంచుకున్నారు. భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.