Asianet News TeluguAsianet News Telugu

చిరంజీవి బయోపిక్ ఆయనే చేయాలి.. అంతరిక్షం ఫ్లాప్ కు కారణం?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం వాల్మీకి. హరీష్ శంకర్ దర్శకత్వంలో చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. కంచె, అంతరిక్షం, ఫిదా ఇలా తన కెరీర్ లో వరుణ్ తేజ్ విభిన్నమైన చిత్రాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు. వాల్మీకి మూవీ సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.  

Varun Tej interesting comments on Chiranjeevi biopic
Author
Hyderabad, First Published Sep 18, 2019, 2:42 PM IST

వరుణ్ తేజ్ తొలిసారి మాస్ అవతారంలో నటించిన చిత్రం వాల్మీకి. ఈ చిత్రంలో హరీష్ శంకర్ వరుణ్ తేజ్ గెటప్, బాడీ లాంగ్వేజ్ ని పూర్తిగా మార్చేశాడు. వరుణ్ ఈ చిత్రంలో తెలంగాణ యాసలో డైలాగులు చెబుతూ మాస్ మేనరిజమ్స్ తో అదరగొడుతున్నాడు. టీజర్, ట్రైలర్స్ లో వరుణ్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. 

వాల్మీకి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో జోరుగా ప్రచార కార్యక్రమాలు సాగుతున్నాయి. తాజాగా వరుణ్ తేజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. దర్శకుడు హరీష్ ఒరిజినల్ జిగర్తాండ కథలో 50 శాతం మార్పులు చేసి వాల్మీకి తెరకెక్కించినట్లు తెలిపాడు. 

గద్దలకొండ గణేష్ పాత్రని హైలైట్ చేయడం కోసమే హరీష్ ఈ మార్పులు చేసినట్లు వరుణ్ తెలిపాడు. ఇక జిగర్తాండ చిత్రంలోని బాబీ సింహా పాత్రని తానూ ఎక్కడా అనుసరించలేదని.. తన పంథాలో తాను నటించానని తెలిపాడు. 

వరుణ్ తేజ్ ప్రయోగాత్మకంగా నటించిన అంతరిక్షం చిత్రం గత ఏడాది విడుదలై నిరాశపరిచింది. దీని గురించి వరుణ్ మాట్లాడుతూ.. అంతరిక్షం చిత్రీకరణ సమయంలోనే ఆ కథకు న్యాయం చేయలేకపోయాం. ఆ చిత్రానికి ఎక్కువ బడ్జెట్ అవసరం. కానీ బడ్జెట్ పరిమితుల వల్ల ఆ చిత్రం అనుకున్న విధంగా రాలేదు. అందుకే నిరాశపరిచింది. 

మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ గురించి కూడా వరుణ్ కామెంట్ చేశాడు. చిరంజీవి బయోపిక్ చిత్రం తెరకెక్కిస్తానని హరీష్ అంటున్నారు. అవకాశం ఉంటే ఆ చిత్రంలో నటిస్తారా అని ప్రశ్నించగా.. హరీష్ ఆ విషయం గురించి నాతో చెప్పలేదు. అయినా చిరంజీవి గారి బయోపిక్ లో చరణ్ అన్న నటిస్తేనే బావుంటుంది. ఆయన చేయకపోతే నేను చేస్తా అని వరుణ్ తెలపడం విశేషం. 

Follow Us:
Download App:
  • android
  • ios