లావణ్య త్రిపాఠి, నిహారిక సమస్యలో ఉన్నామని ఒకేసారి మెసేజ్ చేస్తే ఎవరికి ముందు కాల్ చేస్తారని వరుణ్ తేజ్ ని అడగ్గా ఆసక్తికర సమాధానం చెప్పాడు.
వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ గాండీవధారి అర్జున. మూవీ విడుదలకు సిద్ధంగా కాగా వరుణ్ తేజ్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. లావణ్య త్రిపాఠి, నిహారిక ఇద్దరి నుండి ఒకేసారి 'అర్జెంటు ఫోన్ చెయ్' అని మెసేజ్ వస్తే ముందు ఎవరికి కాల్ చేస్తావ్ అని యాంకర్ సుమ అడిగారు. ఈ ప్రశ్నకు వరుణ్ తేజ్ తడుముకోకుండా సమాధానం చెప్పాడు. నిహారికకు చేస్తాను. ఎందుకంటే తాను చిన్న పిల్ల కదా అన్నాడు.
లావణ్య సమస్యను హ్యాండిల్ చేయకలదు. నిహారిక వల్ల కాదు. అందుకే ముందు నిహారికకు ఫోన్ చేస్తానన్న అర్థంలో వరుణ్ తేజ్ సమాధానం చెప్పాడు. ఇక తన మొబైల్ లో లావణ్య పేరు LAVN అని సేవ్ చేసుకున్నాడట. లావణ్య స్వయంగా ఆలా సేవ్ చేసిందని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు. యాంకర్ సుమ మరికొన్ని ఆసక్తికర ప్రశ్నలు అడిగింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ లో ఎవరిది ఇమిటేట్ చేయడానికి ఇష్టపడతారని అడగ్గా... అవి రెండూ చూడటానికి ఇష్టపడతాను అన్నారు.
రామ్ చరణ్, అల్లు అర్జున్ లలో పెళ్లి తర్వాత ఎవరిలో బాగా మార్పు వచ్చిందని సుమ అడిగారు. పెళ్లయ్యాక ఎవరిలో అయినా మార్పు రావాల్సిందే అని వరుణ్ సమాధానం చెప్పాడు. అంటే ఇద్దరిలో మార్పు వచ్చిందని ఆయన చెప్పకనే చెప్పాడు. సుమ ప్రశ్నలకు వరుణ్ తేజ్ సమాధానాలు ఆసక్తి రేపాయి. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ కి ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది చివర్లో వివాహం జరగనుంది.
ఇక గాండీవధారి అర్జున యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఆగస్టు 25న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. వరుణ్ తేజ్ కి జంటగా సాక్షి వైద్య నటించింది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించారు. ఈ చిత్ర విజయంపై వరుణ్ తేజ్ చాలా ఆశలే పెట్టుకున్నారు. వరుణ్ తేజ్ గత చిత్రాలు ఎఫ్3, గని ఆశించిన స్థాయిలో ఆడలేదు.
