ప్రముఖ రచయిత, హీరో వరుణ్‌ సందేశ్‌ తాత జీడిగుంట రామచంద్రమూర్తి కన్నుమూశారు. కరోనా కారణంగా ఆయన చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. కరోనా అనేక మందిని బలితీసుకుంటోంది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ నుంచి, లెజెండరీ సింగర్‌ బాలసుబ్రమణ్యం వరకు అనేక మంది కరోనా కారణంగా కన్నుమూశారు. ఇప్పుడు ప్రముఖ రచయితని కూడా కరోనా బలితీసుకోవడం బాధాకరం. 

రేడియో నాటకాలు రాయడం, వాటిల్లో నటించడం, కథలు, నాటికలు, నవలలు, సినీ డైలాగులు, అనువాద వ్యాసాల రచన ఇలా అనే అంశాల్లో తన ప్రతిభని చాటుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విద్యా శాఖలో ప్రభుత్వ ఉద్యోగం వదులుకుని ఆకాశవాణిలో ఉద్యోగం చేశారు. రిటైర్‌మెంట్‌ వరకు అందులోనే సేవలందించారు. 

ఆలిండియా రేడియో హైదరాబాద్‌ కేంద్రంలో 28ఏళ్ళపాటు సేవలందించారు. రేడియో రచయితగా `కుటుంబ నియంత్రణ` విభాగంలో స్క్రిప్ట్ రచయితగా, తర్వాత నాటక విభాగంలో కార్యక్రమ నిర్వహణాధికారిగా పనిచేశారు.
అప్పుడే దాదాపు 40 నాటికల్ని, నాటకాలను రాసి ప్రసారం చేశారు. ప్రయోక్తగా మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన `మందాకిని`, ముదిగొండ శివప్రసాద్‌ రాసిన `అనుభవ మంటపం`, వాసిరెడ్డి సీతాదేవి `ఉరితాడు`, యందమూరి వీరేంద్రనాథ్‌ `నిశ్శబ్దం నీకూ నాకు మధ్య` వంటి నవలనను రేడియో నాటకాలుగా ప్రసారం చేశారు. నాలుగేండ్ల పాటు కార్మికుల కార్యక్రమాలను నిర్వహించిన రికార్డ్ సృష్టించారు. 

ప్రముఖ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు నిర్మించిన `అమెరికా అబ్బాయి` సినిమాకు ఆయన కథ రాశారు. తర్వాత `ఈ ప్రశ్నకు బదులేది`, `పెళ్లిళ్లోయ్ పెళ్లిళ్లు` అనే సినిమాలకు డైలాగులు రాశారు. `మరో మాయాబజార్`, `అమృత కలశం` చిత్రాలకు సహ రచయితగా వ్యవహరించారు. టెలివిజన్ లో బాగా ప్రేక్షకాదరణ పొందిన జీ `మనోయజ్ఞం` సీరియల్‌కు 40 ఎపిసోడ్లకు స్క్రిప్ట్ రాశారు. 

జీడిగుంట రామచంద్రమూర్తికి ముగ్గురు కుమారులు. ఇద్దరు అమెరికాలో ఉంటారు. రెండో కుమారుడు జీడిగుంట శ్రీధర్‌ టీవీ సీరియళ్లలో నటుడు. వరుణ్‌ సందేశ్‌.. ఆయన పెద్ద కుమారుడు విజయసారథి కుమారుడు. ఆయన రచనలకు అనేక అవార్డులు దక్కాయి. చాట్ల శ్రీరాములు అందించే `ప్రతిభా పురస్కారం` 2015లో అందుకున్నారు. అదే ఏడాది ఏపీ ప్రభుత్వం అందించే కళారత్న పురస్కారం దక్కింది. సారా నిషేధ ఉద్యమంపై రచించిన పరివర్తన`కు నంది అవార్డు దక్కింది. రామచంద్రమూర్తి మృతి పట్ల సినీ, సాహిత్య ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనకు శాంతి చేకూరాలని సంతాపం తెలిపారు.