బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ ఎంత కష్టపడి అవుట్ పుట్ ఇస్తాడో తెలిసిందే. ముఖ్యంగా డాన్స్ లలో , ఫైట్స్ లో అతన్ని కొట్టేవాళ్లు లేరు. అతని కమిట్మెంట్ చూసే పెద్ద సంస్దలు సైతం అతనితో సినిమా లు చేస్తున్నారు. భారీ బడ్జెట్ లు పెడుతున్నాయి. తాజాగా వరుణ్ ధావన్ స్ట్రీట్ డ్యాన్సర్స్ 3డి అనే చిత్రం చేస్తున్నారు. సినిమా పూర్తిగా డాన్స్ లతో దుమ్ము రేపే విధంగా ఉండబోతోందని సమాచారం. ఇందుకోసం పంజాబ్, దుబాయి, లండన్ లో షూటింగ్ చేసారు. ప్రస్తుతం ముంబై లో ఫైనల్ డాన్స్ కు సంభందించిన సీన్స్ షూట్ చేసారు. 
 
గత కొద్దిరోజులుగా జలుబు, జ్వరంతో  కాస్త అనారోగ్యంగా ఉన్నాడు వరుణ్ ధావన్. దాంతో ఆహారం సరిగ్గా తీసుకోవటం లేదు. ఈ విషయం సోషల్ మీడియాలో కూడా షేర్ చేసాడు. అయితే అంత నీరసంగా ఉన్నా, షూటింగ్ పూర్తి చేయాలని 18 గంటల సేపు సెట్ లోనే ఉన్నాడు. ఆ షూట్ లో కంటిన్యూగా పాల్గొనటంతో స్పృహ తప్పిపడిపోయాడు. వెంటనే డాక్టర్ ని పిలిపించి చూపిస్తే లో బ్లడ్ ప్రెషర్ తో ఉన్నాడని,  కొద్ది రోజులుపాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. ఆ తర్వాత షూటింగ్ కాన్సిల్ చేసి వరుణ్ ని ఇంటికి పంపేసారు. ఇదంతా నాలుగు రోజుల క్రితం జరిగింది. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు. షూటింగ్ లో కూడా డబుల్ షిప్ట్ లో పాల్గొని పూర్తి చేసాడు. 
  
3డి ఫార్మట్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్. డాన్స్ నేపథ్యంలో రిమో డిసౌజా డైరెక్ట్ చేసే ఈ సినిమాని భూషణ్ కుమార్, లిజెల్లే డిసౌజా, కృష్ణకుమార్ నిర్మిస్తున్నారు.  “ప్రతి రూలూ బ్రేకవుతుంది. మేము ఎక్స్‌ప్రెస్ చెయ్యడానికి డాన్స్ చేస్తాం, ఇంప్రెస్ చెయ్యడానికి కాదు” అని కూడా చెప్పాడు వరుణ్. రిమో డిసౌజా డైరెక్టర్ కావడం, వరుణ్, శ్రద్ధ నటిస్తుండటంతో దీనికి ‘ఏబీసీడీ 3’ అనే టైటిల్ పెడతారేమోనని అనుకున్నారు. ఎందుకంటే ‘ఏబీసీడీ 2’లో ఆ ఇద్దరూ జంటగా నటించారు. అయితే ‘స్ట్రీట్ డాన్సర్’ టైటిల్‌తో ఇది ఆ ఫ్రాంచైజీ సినిమా కాదని చెప్పారు.