శరత్‌ కుమార్‌ తనయ, నటి వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ నటిగా రాణిస్తుంది. హీరోయిన్‌గానే కాకుండా నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రల్లోనూ మెప్పిస్తుంది. తెలుగులో `తెనాలి రామకృష్ణ`లో మెప్పించింది. అంతకు ముందు `పందెంకోడి 2` ద్వారా తెలుగు ఆడియెన్స్ ని అలరించింది. విలక్షణ నటనతో ఆకట్టుకుంటోన్న వరలక్ష్మీ మెగాఫోన్‌ పడుతోంది. 

`కన్నామూచి` పేరుతో ఓ సినిమాని రూపొందిస్తుంది. దీని అర్థం `దాగుడు మూతలు`. `మహిళా సాధికారతను తెలియజేసేలా ఇక్కడ చాలా ధైర్యవంతురాలైన మహిళ ఉంది. మనకు వారు తెలుసు. మనలోనే వారుండొచ్చు. అలాంటి వారి గురించి బలంగా చెబుదాం` అని చెబుతూ, టాలీవుడ్‌, కోలీవుడ్‌ హీరోయిన్లు ఈ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు.  

తమన్నా, రకుల్‌, సమంత, ఐశ్వర్యా రాజేష్‌, సాయిపల్లవి, తాప్సీ, మంచు లక్ష్మీ, హన్సిక, సుహాసిని, సిమ్రాన్‌, రాధికా శరత్‌ కుమార్‌, జ్యోతిక, కీర్తిసురేష్‌, మంజిమా మోహన్‌, కాజల్‌, రెజీనా, శ్రద్ధాశ్రీనాథ్‌, అదితి రావు హైదరీ, శృతి హాసన్‌ వంటి కథానాయికలు వరలక్ష్మీకి అభినందనలు తెలిపారు. తెన్నాండాల్‌ ఫిల్మ్స్ పతాకంపై రామస్వామి నిర్మిస్తున్నారు. 

ఇదిలా ఉంటే వరలక్ష్మీ ప్రస్తుతం డజన్‌ వరకు సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. అందులో తెలుగులో `క్రాక్‌`, `నాంది`, `అద్దం` చిత్రాల్లో నటిస్తుండగా, తమిళంలో ఏడు సినిమాలు, కన్నడలో ఓ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తుంది.