తమిళ నటుడు విశాల్, హీరోయిన్ వరలక్ష్మీ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. ఆ మధ్య నడిగర్ సంఘం ఎన్నికల సందర్భంగా వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ కి విశాల్ కి మధ్య గొడవలు జరిగినా.. వరలక్ష్మి తన స్నేహాన్ని వదులుకోలేదు.

అయితే మరోసారి ఎన్నికల హడావిడి మొదలవ్వడంతో విశాల్ అండ్ టీం శరత్ కుమార్, రాధారవిలపై ఆరోపణలు చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇది చూసిన వరలక్ష్మి  ఆగ్రహంతో ఊగిపోయింది. విశాల్ పై కోపాన్ని ఓ లేఖ రూపంలో రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

విశాల్ ఎలెక్షన్ క్యాంపెయిన్ వీడియో తనను ఎంతగానో బాధించిందని, ఇప్పటివరకు తనపై ఏదైనా గౌరవం ఉంటే అదంతా ఇప్పుడు పోయిందని చెప్పింది. తప్పులు నిరూపితం కాకుండా తన తండ్రిని పదే పదే టార్గెట్ చేయడం చట్టప్రకారం తప్పని తెలిపింది. ఇలాంటి చీప్ వీడియోలను చేయడాన్ని బట్టి నీ పెంపకం ఎలా ఉందో అర్ధమవుతుందని మండిపడింది.

గత ఎన్నికల్లో గెలిచిన నువ్ ఎన్నో మంచి పనులు చేశానని అంటున్నావు కదా.. వాటి గురించి చెప్పుకుంటూ ఎన్నికల ప్రచారం చేయడం మానేసి.. ఈ సారి ఎన్నికల్లో లేని మా నాన్నను టార్గెట్ చేసి ఇలాంటి చర్యలను పాల్పడం సిగ్గుచేటు అంటూ విశాల్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఓ ఫ్రెండ్ గా ఇప్పటివరకు ఎంతో గౌరవం ఇచ్చానని.. ఇప్పుడు నువ్ చేసిన చర్య మన మధ్య దూరాన్ని పెంచిందని చెప్పుకొచ్చింది.