దశాబ్దాల నాటి లేడీస్ టైలర్ కు సీక్వెల్ వస్తోంది లేడీస్ టైలర్ దర్శకుడు వంశీ దర్శకత్వంలోనే సినిమా వంశీ... ఫ్యాషన్ డిజైనర్ s/o లేడీస్ టైలర్ టైటిల్ తో వస్తోన్న మూవీ 

సీనియర్ దర్శకుడు వంశీ మూడు ద‌శాబ్దాల కింద‌ట తీసిన క్లాసిక్ మూవీ ‘లేడీస్ టైల‌ర్‌’. ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్‌ గా వంశీ తెర‌కెక్కిస్తున్న ‘ఫ్యాష‌న్ డిజైన‌ర్’ (స‌న్నాఫ్ లేడీస్ టైల‌ర్ అన్న‌ది ట్యాగ్ లైన్‌) ప్రి లుక్ వ‌చ్చేసింది. ప్రి లుక్ లో హీరోను చూపించ‌కుండా అత‌ను ఓ అమ్మాయికి కొల‌త‌లు తీస్తున్న దృశ్యాన్ని పెట్టారు. కారు స్టీరింగ్ అమ‌ర్చిన సైకిల్.. పాత స్ట‌యిల్లోనే ఉన్న కుట్టు మిష‌న్.. ఇలా వంశీ మార్కు ప్రాప‌ర్టీస్ ప్రి లుక్ పోస్ట‌ర్లో క‌నిపిస్తున్నాయి. ప్రి లుక్ జనాల్లో క్యూరియాసిటీ తెచ్చేలాగే కనిపిస్తోంది. అమ్మాయికి హీరో అలా కొలతలు తీస్తున్నట్లు కనిపిస్తే ఇక క్యూరియాసిటీ పెరగక ఇంకేమవుతుంది?

గత కొన్నేళ్లుగా వంశీతో సినిమాలు తీయడానికి ఎవరూ సాహసించట్లేదు. ఐతే మధుర శ్రీధర్ రెడ్డి మాత్రం వంశీ మీద నమ్మకంతో కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. ఈ చిత్రంలో ఎమ్మెస్ రాజు త‌న‌యుడు సుమంత్ అశ్విన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి ముగ్గురు హీరోయిన్లను ఎంపిక చేశాడు వంశీ. అందులో ఒకరు ‘అలియాస్ జానకి’.. ‘రన్’ లాంటి సినిమాల్లో నటించిన అనీషా ఆంబ్రోస్. మిగతా ఇద్దరు.. మనాలి రాథోడ్, మానస హిమవర్ష. వీళ్లు కొత్తవాళ్లు.

‘లేడీస్ టైలర్’ హీరో రాజేంద్ర ప్రసాద్ కూడా ఇందులో కీలక పాత్ర చేస్తున్నాడు. ఆయన హీరో తండ్రిగా కనిపిస్తాడట. మ‌ణిశ‌ర్మ సంగీతాన్నందిస్తున్నాడు. ఈ చిత్రం దాదాపుగా పూర్తి కావ‌చ్చింద‌ట‌. త్వ‌ర‌లోనే ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌బోతున్నారు. మూడు దశాబ్దాల కిందట వచ్చిన సినిమాకు ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ చేస్తుండ‌టం.. ఒరిజినల్ తీసిన డైరెక్టరే సీక్వెల్ ను కూడా డైరెక్ట్ చేస్తుండ‌టం విశేషం.