గోదావరి జిల్లాలో పుట్టిన వంశీకు ఆ గోదారి అంటే ఎంతో ప్రేమ,పిచ్చి. జీవితం పెరుగుతున్న కొద్ది ఆ ప్రేమ మరింతగా పెరుగుతూ పరవళ్లు తొక్కుతోందే కానీ కొద్దిగా కూడా వెనకడుగు వెయ్యటం లేదు. తన సినిమాలతో,అందులోని పాటలతో, తన పుస్తకాలతో గోదారికి అవకాశం ఉన్నప్పుడులా నీరాజనాలు అందిస్తున్న వంశీ ఇప్పుడో గొప్ప ప్రాజెక్టుని తలకెత్తున్నట్లు సమాచారం. ఆ గోదావరి ఇసుక తిన్నెలు, అక్కడున్న పిల్ల కాలువలు, పిల్లకాయలు, పచ్చని చెట్లు..గోదారి జనాల గోరోజనం గట్లు ఇలా ప్రతి గోదావరి అందాన్ని తనదైన శైలిలో మరో సారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారట. గోదారి చిత్రాలతో తన ఫేస్ బుక్ పేజ్ ద్వారా, ప్రతిరోజూ ఉదయం శుభోదయం అని పలకరిస్తూ మనతో పంచుకునే ఆయన ప్రపంచానికి కూడా ఆ అందమైన, ఆహ్లాదకరమైన గోదారి జీవితాన్ని పరిచయం చేయబోతున్నారు.


వివరాల్లోకి వెళితే.. సీరియ‌ర్ ద‌ర్శ‌కుడు వంశీ ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ అయిన ఓటీటీ కోసం ఓ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నట్లు సమాచారం. అయితే.. ఇది ఓ డాక్యుమెంట‌రీ త‌ర‌హా లో సాగుతుంది. వంశీకి చాలా ఇష్టమైన గోదావ‌రి ప‌రివాహక ప్రాంతాలూ, అక్క‌డి ప్ర‌జ‌ల అభిరుచులు, అక్క‌డి చ‌రిత్ర‌, ఆ ప‌రివాహ‌క ప్రాంతాల నుంచి వ‌చ్చిన సెల‌బ్రెటీలూ, అక్క‌డి రుచులూ.. అభిరుచులు ఇలా గోదావ‌రి గురించిన స‌మ‌స్త జీవిన స‌మాచారాన్నీ క్రోడీక‌రించి ఈ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. నిజానికి ఇది ఇప్పటివరకూ ఎవరు చేయని చాలా పెద్ద ప్ర‌య‌త్నం. నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటీటీ వేదిక‌గా ఇది రూపొందుతోందని వార్తలు వస్తున్నాయి. గతంలో నెట్ ప్లిక్స్ లో  ఇలాంటి డాక్యుమెంట‌రీల‌ు వచ్చాయి. అయితే నెట్ ప్లిక్స్ లోనే ఈ డాక్యుమెంటరీ రాబోతోందనే అధికారిక సమాచారం అయితే ఏమీ లేదు.

ఇక తన కెరీర్ లో  సూపర్ హిట్ సినిమాలను అందించిన వంశీకి తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. మంచుపల్లకి, సితార, అన్వేషణ, ప్రేమించు పెళ్ళాడు, లేడీస్ టైలర్, చెట్టు కింద ప్లీడర్, ఏప్రిల్ 1 విడుదల, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, గోపి గోపిక గోదావరి.. ఇలా ఎన్నో మంచి సినిమాలను తెరకెక్కించారు. అయితే గత కొంత కాలంగా ఈయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో  ఈ దర్శకుడు ప్రస్తుతం తన స్వీయ చరిత్రను రాసే పనిలో పడ్డాడట. 'పొలమారిన జ్ఞాపకాలు' అనే ఆసక్తికరమైన టైటిల్ తో ఈ ఆటో బయోగ్రఫీ ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. అయితే దర్శకుడిగానే కాక వంశీ మంచి రైటర్ గా కూడా పేరు తెచ్చుకున్నారు. బోలెడు కథలు, నవలలు, సీరియల్స్ కూడా రాసిన వంశీ ఇప్పుడు తన స్వీయ చరిత్రను స్వహస్తాలతో రాయనున్నారు.