సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం మే నెలలో విడుదలై ఘనవిజయం సాధించింది. మహేష్ బాబు కెరీర్ లో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా మహర్షి నిలిచింది. ఈ చిత్రంలో మహేష్ ని మూడు విభిన్న కోణాల్లో చూపించడంలో దర్శకుడు వంశీ పైడిపల్లి సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. 

ఆదివారం రోజు టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ లండన్ లోని ఓవల్ మైదానంలో జరిగింది. మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలసి స్టేడియంలో మ్యాచ్ ని వీక్షించాడు. మహర్షి డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా వీరితో జాయిన్ అయ్యారు. స్టేడియంలో మహేష్ బాబుతో తీసుకున్న సెల్ఫీ వంశీ పైడిపల్లికి చిక్కులు తెచ్చిపెట్టింది. ఆ ఫోటోని వంశీ పైడిపల్లి ట్విట్టర్ లో షేర్ చేస్తూ 'CelebratingMaharshi' హ్యాష్ ట్యాగ్ ఉపయోగించారు. 

దీనిపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఎక్కడకు వెళ్లి ఏం మాట్లాడుతున్నారు..వరల్డ్ కప్ మ్యాచ్ కు హాజరై CelebratingMaharshi అనే హ్యాష్ ట్యాగ్ అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ఒక సినిమాకు ఇన్నిసార్లు సెలెబ్రేషన్స్ ఉంటాయా అని మరికొందరు జోకులు పేలుస్తున్నారు. స్టేడియంలో CelebratingMaharshi అని ఓ ప్లే కార్డు పట్టుకుని ఉండాల్సింది అంటూ మరొకరు సెటైర్ వేశారు. మహేష్ బాబు మాత్రం మ్యాచ్ గురించి ట్వీట్ చేస్తూ INDVsAUS అనే హ్యాష్ ట్యాగ్ ఉపయోగించాడు.