కోలీవుడ్‌ స్టార్‌ అజిత్‌తో సినిమా చేయాలనేది అతిలోక సుందరి శ్రీదేవి కోరిక. అది ఆమె ఉన్నప్పుడు నెరవేరలేదు. ఆమె మరణాంతరం భర్త బోనీ కపూర్‌ ఆ కోరిక నెరవేర్చాడు. అజిత్‌తో ఇప్పటికే `పింక్‌` రీమేక్‌ `నెర్కొండ పార్వై` సినిమా తీసి హిట్‌ అందుకున్నాడు. ఇప్పుడు ఆ సెంటిమెంట్‌ని రిపీట్‌ చేస్తూ `వాలిమై` సినిమాని నిర్మిస్తున్నారు. అజిత్‌ హీరోగా, బాలీవుడ్‌ నటి హ్యూమా ఖురేషీ హీరోయిన్‌గా నటిస్తుండగా, టాలీవుడ్‌ హీరో కార్తికేయ ఇందులో విలన్‌గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. వినోద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని మే 1న విడుదల చేయాలని భావించారు. 

మే1న అజిత్‌ పుట్టిన రోజు. అంతేకాదు అది ఆయన 50వ పుట్టిన రోజు కావడం విశేషం. ఈ సందర్భంగా ఆయన ఫ్యాన్స్ కి ట్రీట్‌ ఇవ్వాలని భావించారు దర్శక, నిర్మాతలు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్‌ రాకపోవడంతో ఇటీవల అజిత్‌ ఫ్యాన్స్ సీరియస్‌ అవుతూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఈ సారిఎలాగైనా మంచి అప్‌డేట్‌ ఇవ్వాలని యూనిట్‌ భావించింది. అజిత్‌ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్‌ విడుదల చేయాలని భావించారు. కానీ ఇప్పుడు దాన్ని వాయిదా వేశారు. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్‌ విడుదల చేయడం లేదని నిర్మాత బోనీ కపూర్‌ ప్రకటించారు. 

`అజిత్ కుమార్ 50వ పుట్టినరోజును పురస్కరించుకొని మే 1న `వాలిమై` చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేయాలని భావించాం. మేము ఈ స్టేట్‌మెంట్ ఇచ్చినప్పుడు కరోనా సెకండ్ వేవ్  భారతదేశాన్ని ఈ విధంగా సునామీలా వ్యాపిస్తుందని ఊహించలేదు. అయినవారిని కోల్పోయి.. అందరూ మానసిక వేదనను అనుభవిస్తున్నారు. ఇలాంటి సమయంలో `వాలిమై` చిత్ర ఫస్ట్ లుక్‌ని మే 1వ తేదీన విడుదల చేయడం మంచిది కాదని చిత్రయూనిట్ అంతా నిర్ణయించింది. త్వరలోనే దీనికి మరో డేట్ ప్రకటిస్తాం. అందరూ జాగ్రత్తగా, క్షేమంగా ఉండండి` అని తెలిపారు. దీంతో షాక్‌ తిన్న అజిత్‌ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలోకి వెళ్లారు.