నిర్మాణ విషయంలోనే కాదు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేయటంలోనూ, థియోటర్స్ ఎంపిక చేయటంలోనూ దిల్ రాజు ని మించిన వారు లేరని చెప్తూంటారు. ఎందుకంటే ఆయనకు నిర్మాతగానే కాదు డిస్ట్రిబ్యూటర్ గానూ ఎంతో అనుభవం ఉంది. దాంతో ఏ ప్రాంతంలో ఎలాంటి సినిమాలు ఆడతాయి..ఏ హీరో సినిమాలు ఏ సీజన్ లో అయితే వర్కవుట్ అవుతాయి. ఎంత రేటుకు ఏ సెంటర్లో సినిమాని అమ్మాలి వంటివి ఆయనకు బాగా తెలుసు. అలాంటి దిల్ రాజు ని ఇప్పుడు తన సినిమా రిలీజ్ విషయంలో హీరో నాని విభేధిస్తున్నట్లు సమాచారం. ఆ సినిమా మరేదో కాదు వి. 

వివరాల్లోకి వెళితే...నేచురల్‌ స్టార్‌ నాని, సుధీర్‌ బాబులు నటిస్తున్న చిత్రం ‘వి’. అదితిరావు హైదరి, నివేదా థామస్‌ హీరోయిన్స్ లుగా కనిపిస్తున్న ఈ చిత్రాని​కి ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్ కు ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది.  అయితే ట్రేడ్ పరంగా ఈ సినిమాకు పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు. టీజర్ తర్వాత ఈ సినిమాపై అంచనాలు  పెరిగిపోతాయనుకుంటే నిరాశే ఎదురైంది. అలాగని అసలు బజ్ లేదని కాదు. నాని మిగతా చిత్రాలతో పోలిస్తే బాగా తక్కువ అని. దాంతో ఈ చిత్రం రిలీజ్ ని సరైన సమయం చూసి చెయ్యాలనేది నిర్మాత దిల్ రాజు ఆలోచన. ఈ విషయమై నిర్మాతకు, హీరోకు మధ్య టాక్స్ జరుగుతున్నాయట.

అయితే దిల్ రాజు ఓ ప్రక్కన పెద్దగా బజ్ లేకపోవటం, మరో ప్రక్కన ఇప్పటికే రిలీజైన సినిమాలకు అసలు కలెక్షన్స్ లేకపోవటం చూసి ఇలాంటి అన్ సీజన్ లో రిలీజ్ చేయటం వల్ల ఉపయోగం లేదని,వాయిదా వేద్దామని అన్నారట. అయితే తనకు సినిమాపై పూర్తి నమ్మకం ఉందని ముందు అనుకున్నట్లుగా మార్చి 25న విడుదల చేస్తే బాగుంటుందని నాని చెప్తున్నట్లు సమాచారం.అయితే ఈ ఆలోచనను దిల్ రాజు అసలు ఒప్పుకోవటం లేదట. దానికి తోడు కరోనా వైరస్ ఎఫెక్ట్ కూడా కనపడుతోందని ఆయన చెప్పి నానిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట.

నాని  ఈ చిత్రంలో పూర్తి నెగటీవ్‌ షేడ్స్‌ ఉన్న క్రిమినల్ పాత్రలో కనిపిస్తుండగా.. పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ గా సుధీర్‌ బాబు మెప్పించనున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. జగపతిబాబు, అవసరాల శ్రీనివాస్‌, వెన్నెల కిషోర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అమిత్‌ త్రివేది సంగీతమందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్, హర్షిత్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25న విడుదల కానుందా లేదా అన్నది సస్పెన్స్.