ఉస్తాద్ భగత్ సింగ్ కి మరోసారి బ్రేక్!
పవన్ కళ్యాణ్ పొలిటికల్ టూర్ తో మరోసారి ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ అటకెక్కింది. శనివారం రాత్రి హుటాహుటిన విజయవాడ బయలుదేరిన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ షూటింగ్ కి హాజరు కాలేకపోయాడు.

దర్శకుడు హరీష్ శంకర్ రెండేళ్లుగా పవన్ మూవీ కోసమే ఉన్నాడు. భవదీయుడు భగత్ సింగ్ గా మొదలైన ప్రాజెక్ట్... ఉస్తాద్ భగత్ సింగ్ రూపం తీసుకుంది. ఒరిజినల్ కథను పక్కన పెట్టి తేరి రీమేక్ తెరపైకి తెచ్చారు. మధ్యలో ఒప్పుకున్న భీమ్లా నాయక్, బ్రో చిత్రాలు పూర్తి చేసిన పవన్ హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు డిలే చేశారు. ఒక దశలో ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిపోయిందన్న ఊహాగానాలు వినిపించాయి. ఆ కథనాలపై హరీష్ శంకర్ మౌనం వహించడంతో నిజమే అని ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయ్యారు.
అనూహ్యంగా మరలా ఉస్తాద్ భగత్ సింగ్ తెరపైకి వచ్చింది. చకచకా పూర్తి చేసి 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందే విడుదల చేయాలని ప్రణాళికలు వేశారన్న మాట వినిపించింది. విడుదల సంగతి అటుంచితే ప్రాజెక్ట్ రద్దు కాలేదనే క్లారిటీ వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ సెప్టెంబర్ 7న పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొన్నారని ట్వీట్ చేశారు. వారానికి పైగా సాగే షెడ్యూల్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలు ప్లాన్ చేశారు.
రెండు రోజుల షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో విజయవాడకు బయలుదేరారు. ఏపీలో పెద్ద హైడ్రామా చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆయన ఏపీలో ఉన్నారు. అనుకున్న ప్రకారం సాగాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ షెడ్యూల్ ఆగిపోయింది. ఈ షెడ్యూల్ కేవలం పవన్ తో కావడంతో ఆయన లేకుండా జరగదు. నెలల తర్వాత పట్టాలెక్కిన మూవీ షూటింగ్ కి అనుకోని విధంగా బ్రేక్ పడిందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జంటగా శ్రీలీల నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.