మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లిన ఎవరైనా సరే.. ఆ ఇంటి కాఫీ, దోశలు రుచి చూడకుండా ఉండరు. ఇండస్ట్రీలో చిరు ఇంటి కాఫీ, దోశలు చాలా ఫేమస్. అంతగా ఎందుకు ఫేమస్ అయ్యాయనే విషయాలను చిరంజీవి కోడలు ఉపాసన చిరునే స్వయంగా అడిగి తెలుసుకుంది. ఈ మధ్యకాలంలో బీపాజిటివ్ అనే మ్యాగజైన్ కోసం ఉపాసన స్పెషల్ 
గా సెలబ్రిటీల ఇంటర్వ్యూలు తీసుకుంటుంది.

ఈ క్రమంలో తన మామగారు మెగాస్టార్ చిరంజీవి ఇంటర్వ్యూ కూడా తీసుకుంది. ఇందులో భాగంగా కాఫీ, దోశల సీక్రెట్స్ గురించి ప్రశ్నించింది. దానికి ఆయన సమాధానాలు చెప్పుకొచ్చారు.

ముందుగా కాఫీ గురించి చెబుతూ.. 'కాఫీ క్రెడిట్ మొత్తం మీ అత్తయ్యకే చెందుతుంది. ఫిల్టర్ కాఫీ కోసం సురేఖ మద్రాసులోనే ఉండేది. చక్కని ఫిల్టర్ కాఫీతో ఆమె రోజు ప్రారంభమయ్యేది. మొదట్లో నాకు కాఫీ ఇష్టముండేది కాదు. ఆమె చేతి మహిమో ఏమో.. నేను కూడా కాఫీ ప్రేమికుడిని అయిపోయాను. దీనికోసం నీలిగిరి నుండి స్పెషల్ గా కాఫీ గింజలను తెప్పించేది. వాటిని వేయించి పొడి చేసి కాఫీ చేసేది. హైదరాబాద్ వచ్చిన తరువాత కూడా అదే పద్దతిని కొనసాగిస్తోంది. ఆ కారణం చేతే మన ఇంటి కాఫీని అందరూ ఇష్టపడుతున్నారు' అంటూ ఉపాసనతో చెప్పుకొచ్చారు. 

ఇక దోశ గురించి చెబుతూ.. 'షూటింగ్ కోసం చిక్ మంగుళూరు వెళ్లినప్పుడు అక్కడున్న హోటల్ లో దోశ తిన్నాను. చాలా రుచిగా ఉంది. దీంతో దోశ కోసం ఉపయోగించిన పదార్థాల గురించి ప్రశ్నిస్తే సదరు హోటల్ యజమాని అది తమ సంప్రదాయ వంటకమని ఆ రహస్యం చెప్పలేమని చెప్పడంతో తిరిగి ఇంటికి వచ్చేశాను. ఇంటికి వచ్చిన తరువాత సురేఖతో అదే విషయాన్ని చర్చించి చాలా ప్రయత్నాలు చేసి ఫైనల్ గా ఆ దోశ కంటే రుచికరంగా తయారైంది. దోశ కోసం ప్రభుదేవా, జయసుధ లాంటి వాళ్లు కూడా ఇంటికి వచ్చేవారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు' అంటూ అప్పటి సంగతులను గుర్తు చేసుకున్నారు. 

ఆ దోశ సీక్రెట్ ని ఎవరితోనైనా పంచుకున్నారా..? అని ఉపాసన ప్రశ్నించగా.. చట్నీస్ యజమాని అడిగితే ఆ సీక్రెట్ చెప్పినట్లు.. చట్నీస్ హోటల్ చెఫ్ కి ప్రత్యేకంగా దోశ గురించి శిక్షణ ఇప్పించామని.. ఆ తరువాత చిరు దోశగా దాన్ని వాళ్లు ఇంట్రడ్యూస్ చేశారని చెప్పారు.