మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చారిటి విభాగానికి ఉపాధ్యక్షురాలైన ఉపాస‌న వీలున్నప్పుడల్లా పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్న సంగతి తెలిసిందే. సామాజిక కార్యక్రమాలలో తో పాటు సామాజిక మాధ్యమాల్లో కూడా ఉపాసన చురుకుగానే ఉంటుంది. రీసెంట్ గా ఆమె 'సేవ్ ఇండియా బిగ్ క్యాట్స్'  అనే  పెంపుడు జంతువుల సంరక్షణ శిబిరం ప్రారంభించటానికి  రాజస్థాన్ కు వెళ్లారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ సహకారంతో ఈ శిబిరం ఏర్పాటైంది. వారి ఆహ్వానం పైనే ఉపాసన రాజస్దాన్ వెళ్లటం జరిగింది. 

జంతు సంరక్షణ కోసం పాటుపడే ఆమెతో పాటు వన్యప్రాణి ఔత్సాహికులైన 12 మంది పాఠశాల బాలికలు ఈ శిబిరానికి హాజరయ్యారు. ఈ పోగ్రాం కు  సంబంధించిన కొన్ని ఫోటోలను ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. సామాజిక అంశాలపై ఉపాసన చూపుతున్న శ్రద్ద పట్ల నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 
 
ఆరోగ్యకరమైన, సేంద్రీయ ఫుడ్ పట్ల ఉపాసనకు ఉన్న ఆసక్తిని గౌరవిస్తూ తాజ్ వివంతా యాజమాన్యం తమ యొక్క నిపుణులైన చెఫ్ లు చేసే డిజర్ట్స్,వంటలను ఆమె పరిశీలించే విధంగా ఏర్పాట్లు చేశారు. శ్రావ్యమైన మెలోడీస్ , డాన్స్ మరియు బార్బెక్యూ సెషన్ తో వారి తొలి రోజు ముగియగా, జాతీయ స్థాయిలో పులుల విలుప్తత మరియు అవగాహనను విస్తరించే అంశాలను తెలుసుకునే విధంగా, ఆ పరిస్థితులను అర్థం చేసుకున్నారు.

 ఇక ఆ మధ్యన తమ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఓ దివ్యాంగుల వ‌స‌తి గృహానికి వెళ్ళిన ఉపాసన.. అక్క‌డ తానే స్వయంగా వారికి భోజ‌నం వ‌డ్డించారు. వారికి దుప్ప‌ట్లు పంచిపెట్టి, అక్కడే కాసేపు సరదాగా గడిపి వారికి ఓ కొత్త ఉత్సాహాన్ని అందించారు. అయితే, ప్రస్తుతం పాఠశాల భవనం మాత్రమే మంజూరైన ఆ దివ్యాంగులకు ఉండటానికి పక్కా వసతి గృహం లేదని తెలుసుకుని, ట్విటర్ ద్వారా తెలంగాణ సర్కార్‌కి ఓ విజ్ఞప్తి చేశారు‌. ఇప్పటికే ఎంతో బాగా పనిచేస్తున్న తెలంగాణ ప్ర‌భుత్వం.. తమపై ఇంకొంత ప్రేమను చూపించి ఈ అమ్మాయిలకు ఓ కొత్త హాస్టల్ భవనాన్ని మంజూరు చేయాల్సిందిగా తన ట్వీట్‌లో కోరారు.