మెగా కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ సతీమణి ఉపాసన తెలుగు ప్రజలందరికీ సుపరిచితమే. అపోలో లైఫ్‌ వైస్ చైర్సన్‌గా వైద్య రంగంలో విశేష కృషి చేస్తున్న ఉపాసన, రామ్  చరణ్‌ను పెళ్లి చేసుకున్న తరువాత సినీ రంగానికి కూడా దగ్గరైంది. ప్రస్తుతం లాక్ డౌన్‌ కారణంగా ప్రజల్లో అవగాహన కల్పించటంలో ఉపాసన ముందే ఉంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం, సురక్షితంగా ఉండటం లాంటి అంశాల మీద అవగాహన కల్పిస్తోంది.

ఈ సందర్భంగా మహిళా వ్యాపార వేత్తలకు చెందిన ఫిక్కి ఎఫ్‌ఎల్‌ఓ ఆధ్వర్యంలో  `ఫ్రీడమ్‌ టు బీ మి` అనే అంశంపై వర్చువల్‌ ఇంటరాక్షన్‌ కార్యక్రమం ఆన్‌లైన్‌ వేదికగా నిర్వహించారు. కార్యక్రమంలో  ఫిక్కి మహిళా సభ్యులతో పాటు ముఖ్య అతిథిగా ఉపాసన పాల్గొన్నారు.  వారికి అనుసంధాన కర్తగా ప్రముఖ టెలివిజన్‌ యాంకర్‌ స్వప్న వ్యవహరించారు.

ఈ సందర్భంగా తన వ్యాపార కార్యక్రమాలపై స్పందించిన ఉపాసన తాను ఇప్పటి వరకు సాధించిన చాలా తక్కువని భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించేందుకు కృషి చేస్తున్నానని చెప్పింది. తాను చేస్తున్న కృషికి గానూ ఆమెకు ఇటీవల దాదాసాహెబ్‌ ఫాల్కే ఫిలాంత్రపిస్ట్‌ అవార్డ్‌ కూడా ఆమెను వరించింది.