హైదరాబాద్‌లోని సినీనటుడు మోహన్ బాబు ఇంటి వద్ద శనివారం కలకలం రేగింది. మోహన్ బాబు ఇంట్లోకి ఓ గుర్తు తెలియని కారు దూసుకెళ్లింది. మిమ్మల్ని వదలమంటూ దుండగులు ఆయన కుటుంబసభ్యులను హెచ్చరించి వెళ్లారు.

దీంతో భయాందోళనలకు  గురైన మోహన్ బాబు కుటుంబసభ్యులు పహాడిషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో మోహన్ బాబు ఇంటి వాచ్‌మెన్ అప్రమత్తంగా లేనట్లుగా తెలుస్తోంది.

దుండుగులు ఏపీ 31 ఏఎన్ 0004 ఇన్నోవా కారులో వచ్చారు. ఘటన జరిగిన సమయంలో వాహనంలో నలుగురు వ్యక్తులు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సినీ పరిశ్రమతో పాటు రాజకీయంగాను పలుకుబడి వున్న మోహన్ బాబు ఇంటికెళ్లి మరీ వార్నింగ్ ఇచ్చేంత శత్రువులు ఎవరా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఆకతాయిల పనా..? లేక దీని వెనుక మరేదైనా కారణం వుందా అన్న దానిపైనా దర్యాప్తు చేస్తున్నారు.