యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'మిషన్ మంగళ్' స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. జగన్ శక్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. అక్షయ్ కుమార్ తో పాటు సోనాక్షి సిన్హా, విద్యాబాలన్, తాప్సి, నిత్యామీనన్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. 

ఈ చిత్ర స్పెషల్ షోని సెలెబ్రిటీల కోసం ఢిల్లీలో ప్రదర్శించారు. ఇస్రో చేపట్టిన మార్స్ మిషన్ ప్రాజెక్టు నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్ర స్పెషల్ స్క్రీనింగ్ కు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ బిజెపి నేత, కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా మిషన్ మంగళ్ చిత్రాన్ని వీక్షించారు. 

అనంతరం ఈ చిత్రం గురించి సోషల్ మీడియాలో తన అభిప్రాయాలని పంచుకున్నారు. మిషన్ మంగళ్ చిత్ర ప్రీవ్యూ చూశా. సినిమా చాలా బావుంది. అద్భుతంగా తెరకెక్కించారు. ఇస్రో ఖ్యాతిని, మార్స్ మిషన్ ప్రాజెక్టు లో వారి కష్టాన్ని ఈ చిత్రాల్లో వర్ణించారు అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 

అక్షయ్ కుమార్ తో పాటు మిషన్ మంగళ్ చిత్ర యూనిట్ తో ఉన్న ఫోటోలని కిషన్ రెడ్డి షేర్ చేశారు. ఈ చిత్ర స్పెషల్ స్క్రీనింగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.