దామచర్ల మండలం దిలావర్ పూర్ గ్రామ పంచాయితీ పరిధి మిట్టతండాకు చెందిన కేతావత్ రూప్ సింగ్(20), కేతావత్ గోపాల్ నాయక్(20) పట్టణంలోని ఓ సెల్ షాపులో పని చేస్తుంటారు. ఎప్పటిలానే సెల్ షాప్ లో పని పూర్తి చేసుకొని ఈ ఇద్దరు స్నేహితులు కొత్త సినిమా 'మహర్షి' రిలీజ్ అవ్వడంతో సెకండ్ షో చూడడానికి వెళ్లారు.

సినిమా చూసి మిర్యాలగూడ నుండి ఇంటికి బైక్ మీద బయలుదేరారు. మార్గమధ్యలో ముత్తిరెడ్డికుంట సమీపంలో అద్దంకి-నార్కట్ పల్లి బైపాస్ ఖలీల్ డాబా వద్ద రోడ్డు దాటుతున్న గేదెను రాత్రి 12:30 గంటల సమయంలో వీరి బైక్ ఢీకొట్టింది. దీంతో కేతావత్ రూప్ సింగ్ అక్కడిక్కడే మృతి చెందగా కేతావత్ గోపాల్ నాయక్ కు తీవ్ర గాయాలయ్యాయి.

ఆ ఇద్దరినీ స్థానిక ఏరియా ఆసుపత్రికి, అక్కడ నుండి గోపాల్ నాయక్ ను హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. దీంతో మిట్టతండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

సెల్ షాప్ లో పనిచేస్తూ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో ఆ దుకాణాల నిర్వాహకులు సంతాప సూచకంగా శుక్రవారం నాడు బంద్ పాటించారు.