నారా రోహిత్ `ప్రతినిధి 2`ని డైరెక్ట్ చేయడంపై టీవీ 5 మూర్తి వివరణ..
వివాదాలకు కేరాఫ్‌గా నిలిచి సంచలనంగా మారిన టీవీ 5 మూర్తి ఇప్పుడు అనూహ్యంగా దర్శకుడిగా మారడం అందరిని ఆశ్చర్యపరుస్తుంటే, ఏకంగా నారా రోహిత్ హీరోగా, ఆయన హిట్ మూవీ `ప్రతినిధి`కి సీక్వెల్‌గా సినిమా చేయడం మరింత షాక్‌కి గురి చేస్తుంది. దీనిపై తాజాగా మూర్తి క్లారిటీ ఇచ్చారు.

టీవీ5 న్యూస్ ఛానెల్‌లో యాంకర్‌గా చేశారు మూర్తి(మూర్తి దేవగుప్తపు). అందులో పలు కాంట్రవర్సీ, ఇంకొన్ని సంచలన వార్తలను ఆయన సమక్షంలో ప్రసారం అయ్యాయి. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను బయటపెడుతూ చాలా కథనాలను ఆయన ప్రసారం చేశారు. డిబేట్‌లు కూడా నిర్వహించారు. ఈ క్రమంలో యాంటీ వైసీపీ యాంకర్‌గా మారారు. ప్రభుత్వ ఆర్డర్‌లో టీవీ తెరపై చూపించడం వంటివి వివాదాలు దారితీశాయి. ఈ క్రమంలో ఆయన ఆంధ్రప్రదేశ్ సీఐడీ విచారణ కూడా ఎదుర్కొన్నారు.
ఇలా కొన్ని వివాదాలకు కేరాఫ్‌గా నిలిచి సంచలనంగా మారిన టీవీ 5 మూర్తి ఇప్పుడు అనూహ్యంగా దర్శకుడిగా మారడం అందరిని ఆశ్చర్యపరుస్తుంటే, ఏకంగా నారా రోహిత్ హీరోగా, ఆయన హిట్ మూవీ `ప్రతినిధి`కి సీక్వెల్‌గా సినిమా చేయడం మరింత షాక్‌కి గురి చేస్తుంది. మీడియా రంగంలో దాదాపు ముప్పై ఏళ్లకుపైగా అనుభవం ఉన్న టీవీ 5 మూర్తి తన అనుభవాలను రంగరించి ఓ స్క్రిప్ట్ రాశారట, అది నచ్చి నారా రోహిత్ తననే దర్శకత్వం వహించమని అడిగినట్టు తాజాగా మూర్తి వెల్లడించారు.
`ప్రతినిధి 2` సినిమా ఫస్ట్ లుక్‌ని నేడు సోమవారం నారా రోహిత్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. చేయిపైకెత్తిన నారా రోహిత్ లుక్ ఆకట్టుకుంటుంది. అయితే ఆయనకు మొత్తం వార్తా పత్రికలు చుట్టి ఉన్నట్టుగా ఉండటం విశేషం. ఇది కొత్తగా ఆలోచింప చేసేలా ఉంది. ఇందులో సామాజిక సమస్యల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమని యూనిట్ వెల్లడించింది. దీనికి మూర్తి దర్శకత్వం వహిస్తున్నట్టు పేర్కొంది. ఈ సందర్భంగా మూర్తి స్పందిస్తూ, `జర్నలిస్ట్ గా నా మదిలో మెదిలిన ఒక ఆలోచనను కథగా మార్చాను. ఆ కథని నమ్మి నన్నే దర్శకత్వం చెయ్యమన్నారు. నా మొదటి సినిమా హీరో నారా రోహిత్. యాన పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నాం. నా 30 ఏళ్ళ జర్నలిజం జీవితంలో నేను వేసే ప్రతిఅడుగులో నాకు తోడుగా ఉంటున్నారు` అని పేర్కొన్నారు మూర్తి.
అయితే ఈ సినిమా ఏపీ ప్రభుత్వంపై సెటైరికల్‌గా ఉండబోతుందని తెలుస్తుంది. గతంలో ఆంధ్రా విశ్వవిద్యాలయాల్లో నియమించిన పాలకమండలి సభ్యులకు సంబంధించి ఒక వార్తను టీవీ 5లో ప్రసారం చేశారు. ఆ నోట్ ఫైల్‌ను మూర్తి టీవీ స్క్రీన్‌పై చూపించడం నేరం అని అధికారిక ఫైల్‌ని చోరీ చేశారని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ పోలీసులు మూర్తిపై కేసు పెట్టారు. ఈ కేసుతో పాటు ఏపీ ప్రభుత్వం పై అసత్య ప్రచారాలు చేస్తున్నందుకు గానూ సీఐడీ అధికారులు ఆయన్ని విచారించారు. ఈ క్రమంలో ఆయన తనని వేధిస్తున్నారంటూ పలు సంచలన ఆరోపణలు కూడా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేలా `ప్రతినిధి2` స్క్రిప్ట్ ఉంటుందని సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.