బ్రహ్మానందం ప్రభాస్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. `కన్నప్ప`లో ప్రభాస్ కీలక పాత్రలో నటించిన నేపథ్యంలో ఆయన పాత్ర ఎలా ఉంటుందో వెల్లడించారు.
హాస్య బ్రహ్మా బ్రహ్మానందం సినిమాల్లో టీవల కాలంలో చాలా తక్కువగా కనిపిస్తున్నారు. రొటీన్ కామెడీ పాత్రలకు ఆయన దూరంగా ఉంటున్నారు. నటనకు స్కోప్ ఉన్న విభిన్నమైన పాత్రలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆ మధ్య `రంగమార్తాండ` మూవీలో ఎమోషనల్ రోల్ చేసి కన్నీళ్లు పెట్టించారు. ఇప్పుడు `కన్నప్ప` చిత్రంతో రాబోతున్నారు. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు నిర్మిస్తున్న చిత్రమిది.
ఇందులో మంచు విష్ణు కన్నప్పగా నటించగా, ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్, బ్రహ్మానందం వంటి నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. భారీ కాస్టింగ్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ నెల 27న సినిమా విడుదల కాబోతుంది.
`కన్నప్ప` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం కామెంట్స్
`కన్నప్ప` చిత్రం మరో వారం రోజుల్లో ఆడియెన్స్ ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా ఈ శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఇందులో బ్రహ్మానందం మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
డబ్బు కోసం చేసిన చిత్రం కాదు ఇదని, సాక్ష్యాత్తు ఆ పరమేశ్వరుడే మోహన్ బాబు చేత ఈ మూవీని చేయించాడని, ఆయనలో ఈ ఆలోచన కల్పించారని తెలిపారు.
మోహన్ బాబు ఈ మూవీ చేస్తున్నారని తెలిసి మొదట ఎందుకు ఈ మూవీ చేస్తున్నారని అనిపించింది. కానీ ఆ తర్వాత ఇలాంటి గొప్ప మూవీని చూశాక ఆ శివుడే ఆయన చేత చేయించాడనిపించిందన్నారు బ్రహ్మానందం.
శివతత్వం గురించి నేటి యువతకు తెలియజేసే ప్రయత్నం `కన్నప్ప`
ఆయన ఇంకా మాట్లాడుతూ, `ఐదు కోట్లు, పది కోట్లతో సినిమాలు చేసి లాభాలు పొందుతూ ఎంతో కొంత వెనక్కి వేసుకుని, మళ్లీ సినిమాలు చేసే మోహన్ బాబు `కన్నప్ప` కోసం రెండు వందల కోట్లు ఖర్చుపెట్టాడంటే ఆశ్చర్యమేసింది.
ఆయన డబ్బు కోసం, లాభాల కోసమో ఈ మూవీ చేయలేదు, శివతత్వాన్ని నేటి యువతకు తెలియజేసే ప్రయత్నం చేశారు. కన్నప్ప కథ ఈతరం యువత తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో, ఒక గొప్ప ఆలోచనతో ఈ మూవీని రూపొందించారు. అంతేకానీ డబ్బుల కోసం చేసింది కాద`ని స్పష్టం చేశారు బ్రహ్మానందం.
మంచు విష్ణు `కన్నప్ప`గా చేసి వారి సరసన చేరిపోయాడు
`కన్నప్ప` పాత్రలోనూ మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు నటించడం కూడా ఆ శివుడి ఆజ్ఞే అన్నారు బ్రహ్మీ. ఎంతో గొప్పవారు, మహోన్నతమైన వ్యక్తులు పోషించిన పాత్రని విష్ణు పోషించడం విశేషమన్నారు.
ఈ క్రమంలో సినిమాని చూసి ఆదరించాలని, ఎలాంటి నెగటివ్ ప్రచారాలు చేయోద్దని, అడ్డుకునే ప్రయత్నం చేయోద్దని వేడుకున్నారు బ్రహ్మానందం. శివుడి గురించి తీసిన ఈ మూవీని అందరు చూసి ఆదరించి ప్రోత్సహించాలని, శివుడి తత్వాన్ని తెలుసుకోవాలని తెలిపారు.
ప్రభాస్ ఎంట్రీ ఇస్తే ఇక శివతాండవమే అంటూ బ్రహ్మానందం కామెంట్
ఈ క్రమంలో ప్రభాస్ గురించి భారీ హైప్ ఇచ్చారు బ్రహ్మానందం. ప్రపంచంలోనే గొప్ప నటుల్లో ప్రభాస్ ఒకరు అని, ఆయన ఈ మూవీ చేయడం విశేషమన్నారు. ఆయన్ని కూడా ఆ శివుడే నటింప చేశాడన్నారు.
మోహన్ బాబుకి ప్రభాస్ ఎంతో సన్నిహితుడు అని, ఆ స్నేహం, అనుబంధంతోనే ఆయన ఇందులో నటించినట్టు తెలిపారు హాస్య బ్రహ్మ.
అంతేకాదు `కన్నప్ప` సినిమాలో ప్రభాస్ పాత్రని లీక్ చేశారు. మూవీపై భారీ హైప్ ఇచ్చారు. బ్రహ్మీ మాట్లాడుతూ, `ప్రపంచం గర్వించదగ్గ నటుల్లో ఒకరు ప్రభాస్.
ఆయన ఈ సినిమా ఎందుకు చేశారంటే, డబ్బుకోసమే, గొప్ప పాత్ర చేయాలనే ఉద్దేశ్యమో కాదు, ప్రభాస్ గొప్ప మనవతా విలువలు కలిగిన వ్యక్తి. ఎవరైనా, ఏదైనా కావాలని చేయి చాచి అడిగితే కాదనే వ్యక్తి కాదు. పైగా మోహన్ బాబుకి అత్యంత సన్నిహితుడు.
మోహన్‌బాబు ఆల్కాహాల్ లాంటివారు, అలవాటైతే ఒదిలిపెట్టలేం. అలా మోహన్ బాబుగారి మత్తులో మునిగితేలినటువంటి ప్రభాస్ ఈ మూవీలో చేశాడు చూడండి.. శివ ప్రభాస్ అతను, శివుడి చేత ప్రకాశింపబడ్డ వాడు.
విగ్గు పెట్టుకుని అలా నడిచి వస్తున్నప్పుడు, ఒళ్లు గగుర్పొడిచి వీరతాండవం, శివతాండవం చేసేటువంటి విధంగా ఈ సినిమాలో నటించాడు` అని చెబుతూ మూవీపై, ప్రభాస్ పాత్రపై హైప్ ఇచ్చాడు బ్రహ్మానందం. బ్రహ్మీ మాటలకు ఫ్యాన్స్ అరుపులతో ఆడిటోరియం ఊగిపోవడం విశేషం.
