Asianet News TeluguAsianet News Telugu

Brahma Mudi Serial Today:నిజంగానే నెలతప్పిన స్వప్న, ఆ బిడ్డకు తాను తండ్రి కాదన్న రాహుల్..!

 స్వప్నను రుద్రాణి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది. అప్పుడే సరిగ్గా స్వప్న కళ్లు తిరిగి పడిపోతుంది. డాక్టర్ కి ఫోన్ చేస్తే, స్వప్న తల్లికాబోతోందని చెబుతుంది. అయితే, ఆ బిడ్డకు తండ్రిని మాత్రం తాను కాదని, స్వప్న బాయ్ ఫ్రెండ్ వల్లే ఈ కడుపు వచ్చింది అని రాహుల్ నింద వేస్తాడు.

Brahma Mudi Serial Today November 23,Rahul, Rudrani Evil move ram
Author
First Published Nov 23, 2023, 9:56 AM IST

Brahma Mudi Serial Today: అరుణ్ కి డబ్బు ఇవ్వడానికి ఏం చేయాలా అని స్వప్న ఆలోచిస్తుంది. నగలు తాకట్టు పెట్టి, డబ్బులు ఇచ్చేయాలి అనుకుంటుంది. ఈ విషయం ఇంట్లో తెలిస్తే, రాహుల్ దొంగతనం చేశాడు అని చెప్పేద్దాం అనుకుంటుంది. అది రాహుల్ వినేసి షాకైపోతాడు. నిన్ను ఇంట్లో నుంచి తరిమివేయడంలో  ఎలాంటి తప్పులేదు అని అనుకుంటాడు. వెంటనే స్వప్న, నగలు అన్నీ తీసుకొని బ్యాగులో పెట్టుకుంటుంది. ఎవరూ చూడకుండా బయటకు వెళ్లిపోతుంది.

మరోవైపు దొంగ కట్టేయడంతో రాజ్, కావ్యలు ఒకరిపై మరొకరు పడుకొని నిద్రపోతారు. రాజ్ లేచి, కావ్యను లేపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇంతలో రాజ్ పిన్ని ధాన్యలక్ష్మి  వచ్చి, కావ్య ఇంకా ఎందుకు రాలేదా అని డోర్ కొడుతూ ఉంటుంది. ఎంతసేపూ డోర్ తీయకపోవడంతో, తానే డోర్ తీస్తుంది. ఇలాంటి దృశ్యాలన్నీ తన కళ్ల ముందే పడతాయి అని తల కొట్టుకుంటుంది. దొంగ ఇలా చేశాడు అని రాజ్ చెప్పేలోగా, ఇదంతా రాజ్ ఐడియా అని కావ్య చెప్పేస్తుంది. తర్వాతే ఆమే స్వయంగా వచ్చి వారిద్దరి కట్లు విప్పతీస్తుంది. విప్పుకోవడం రానప్పుడు, కట్లు ఎలా కట్టుకున్నారు అని చిరాకు పడి వెళ్లిపోతుంది. ఆమె వెళ్లగానే రాజ్ కోపడతాడు. పిన్ని ఎందుకు అబద్ధం చెప్పావ్ అంటే..? దొంగ వచ్చి ఇలా చేశాడు అంటే మీ పరువు పోతుంది అందుకే అలా చెప్పాను అంటుంది. తర్వాత ఆకలేస్తుందని టిఫిన్ చేయమని అడుగుతాడు. 

మరోవైపు స్వప్న నగల బ్యాగు తీసుకొని ఎవరూ చూడకుండా వెళ్లపోతూ ఉంటే, రుద్రాణి చూసేసి, కావాలనే పిలుస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావ్? అత్తారింట్లో చెప్పకుండా వెళ్తున్నావ్ అని అడుగుతుంది. మీరు కనిపించలేదు అందుకే చెప్పలేదు అంటుంది. ఇప్పుడు కనిపించాకదా చెప్పి వెళ్లూ అంటుంది. దీంతో, స్వప్న ఏం చెప్పాలా అని ఆలోచించి పార్లర్ కి వెళ్తున్నాను అంటుంది. అయితే,  నువ్వు వెళ్లడం ఎందుకు? బ్యూటీషియన్ ని ఇంటికి తెప్పిస్తా అంటుంది. తన ఫ్రెండ్ చేస్తుందని కవర్ చేసి వెళ్లపోతుంది. అయితే, పార్లర్ కి వెళుతూ ఈ బ్యాగ్ ఎందుకు అని మళ్లీ రుద్రాణి ఆపుతుంది. ఫేస్ క్రీములు తెచ్చుకోవడానికి బ్యాగ్ తీసుకొని వెళ్తున్నాను అని చెప్పి వెళ్లిపోతుంది. స్వప్న అరుణ్ కి డబ్బులు ఇస్తుండగా ఫోటోలు తీయమని చెప్పు అని రాహుల్ కి రుద్రాణి సలహా ఇస్తుంది.

మరోవైపు కనకం  ఇంట్లో అందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు. అప్పూ తిననని, ఆకలిగా లేదు అని చెప్పినా, మూర్తి వినకుండా తినమని బలవంత పెడతాడు. తానే స్వయంగా వడ్డిస్తూ తినమని చెబుతాడు. చిన్నప్పుడు ఇలానే తినిపించేవాడినని, ఇప్పుడు పెద్దవాళ్లు అయిపోయి మీకు మీరే అన్నీ నేర్చుకుంటున్నారని, మీరే నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారని అప్పూతో మూర్తి అంటాడు. అయితే, మనసు తోచింది చెబుతుందని, కానీ తప్పు, ఒప్పు తెలుసుకొని చేయాలని మంచి మాటలు చెబుతాడు. ప్రేమగా టిఫిన్ కూడా తినిపిస్తాడు. నువ్వు ఏ తప్పు చేయలేదని, అందరిలానే కేవలం ప్రేమించావని, కానీ నీలో ప్రేమను పుట్టించిన దేవుడు ఆ ఆశకు ఆయువు లేకుండా చేశాడని, నువ్వు ప్రేమించిన అబ్బాయికి మరో అమ్మాయి ని జత చేశాడని , ఇది తెలిసి కూడా నువ్వు బాధపడటం కరెక్ట్ కాదని సలహా ఇస్తాడు. నువ్వు బాధపడుతూ, ఇంట్లో వాళ్లను బాధపెట్టడం కరెక్ట్ కాదని , మనసులో నుంచి ప్రేమ ఆలోచన తీసేయమని చెబుతాడు. ఏడుస్తున్న అప్పూ కన్నీళ్లను తుడుస్తాడు. తాను కేవలం కన్నీళ్లు మాత్రమే తుడవగలనని, మనసు కన్నీళ్లు నువ్వే తుడుచుకోవాలని సలహా ఇస్తాడు.

ఇక, ఇంట్లో రాజ్ స్నానం చేసి రెడీ అవుతాడు. రాజ్ కి బాగా ఆకలేస్తుండగా, కావ్య టిఫిన్ తెస్తుంది. తీరా, ప్లేట్ ఓపెన్ చేసి చూస్తే, ‘ఏదో ఒకటి’ అని దోశ వేసుకొని వస్తుంది. అది చూసి రాజ్ షాకౌతాడు. మీరు అడిగిందే తెచ్చా కదా అని కావ్య అడగగా, రాజ్ కోపాన్ని అనుచుకుంటూ ఉంటాడు. నువ్వు ఎక్కడ దొరికావే నాకు అంటూ తనను తానే తిట్టుకుంటాడు. మీ ఏదో ఒకటిలో ఇంత పెద్ద స్క్రిప్ట్ ఉందని తెలుసుకోలేకపోయానని కావ్య ఓవర్ యాక్షన్ చేస్తుంది. రాజ్ ఆకలేస్తోందని బాధపడుతూ ఉంటాడు. దీంతో, కిందకు తీసుకువెళుతుంది. అక్కడ ధాన్యలక్ష్మి ఎదురై, అక్కడ కూడా ఏదో ఒకటి టాపిక్ వస్తుంది. రాజ్ ఏడుపు ముఖం పెడితే, కింద అన్ని టిఫిన్స్ ఉన్నాయని చెబుతుంది. దీంతో, రాజ్ సంతోషంగా టిఫిన్ చేయడానికి కిందకు వెళ్లిపోతాడు.

స్వప్న అరుణ్ ని కలవడానికి వెళ్తుంది. అక్కడ కూడా అరుణ్ మళ్లీ ప్రేమ విషయం తీసుకువస్తాడు. స్వప్న తిడుతుంది. మళ్లీ ఇంకోసారి బ్లాక్ మెయిల్ చేయవని గ్యారెంటీ ఏంటి అని స్వప్న అడుగుతుంది. మోసం చేయనని, మళ్లీ ఇంకోసారి బ్లాక్ మెయిల్ చేయనని, ఈ డబ్బు తీసుకున్న తర్వాత మళ్లీ నా ముఖం కూడా చూపించనని చెబుతాడు. నమ్మేసిన స్వప్న,, ఆ డబ్బులు అరుణ్ కి ఇచ్చేస్తుంది. ఇంకోసారి బ్లాక్ మెయిల్ చేస్తే ఊరుకోను అని వార్నింగ్ ఇస్తుంది. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

స్వప్న కోసం రాహుల్ వెయిట్ చేస్తూ ఉంటాడు. అరుణ్ ఇంకా ఫోటోలు పంపలేదేంటి అని చూస్తూ ఉంటాడు. ఆలోగా అరుణ్ ఫోటోలు పంపుతాడు. అవి చూసి రాహుల్ సంతోషించి, రుద్రాణికి చూపిస్తాడు. స్వప్న రాగానే అదొక తిరుగుబోతు అని అందరినీ నమ్మించి, ఇంట్లో నుంచి గెంటేస్తా అని రుద్రాణి అనుకుంటుంది.

కమింగప్ లో స్వప్నను రుద్రాణి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది. అప్పుడే సరిగ్గా స్వప్న కళ్లు తిరిగి పడిపోతుంది. డాక్టర్ కి ఫోన్ చేస్తే, స్వప్న తల్లికాబోతోందని చెబుతుంది. అయితే, ఆ బిడ్డకు తండ్రిని మాత్రం తాను కాదని, స్వప్న బాయ్ ఫ్రెండ్ వల్లే ఈ కడుపు వచ్చింది అని రాహుల్ నింద వేస్తాడు.మరి ఈ  సమస్య నుంచి స్వప్నకు కావ్య ఎలా కాపాడుతుందో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios