ఆమె ఓ హీరోయిన్, ఫేమస్ నటి, ఇప్పటికే ఓ నేరం కింద జైలు శిక్ష అనుభవిస్తోంది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు, ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న ఆ హీరోయిన్ కు 100 కోట్ల జరిమానా కూడా పడింది. ఇంతకీ విషయం ఏంటంటే?

బంగారం అక్రమ రవాణా కేసులో ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న కన్నడ నటి రన్యా రావుకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) భారీ జరిమానా విధించింది. ఆమెపై 102.55 కోట్లు జరిమానా విధిస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం జైలులో ఉన్న ఆమెకు ఈ నోటీసులు అక్కడికే పంపించి అందజేశారు.

ఈ కేసులో రన్యా రావుతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు కూడా నిందితులుగా ఉన్నారు. ఈ నలుగురుపై కలిపి మొత్తం 270 కోట్ల జరిమానా విధించినట్లు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. నిర్ణీత గడువులోగా ఈ జరిమానా మొత్తాన్ని చెల్లించకపోతే, ఆస్తులను జప్తు చేస్తామని నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు.

ఈ కేసు ఈ ఏడాది మార్చి మొదటి వారంలో వెలుగులోకి వచ్చింది. దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 14.3 కిలోల బంగారంతో రన్యా రావు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులకు చిక్కారు. బంగారం స్మగ్లర్స్ గురించి ముందస్తు సమాచారం రావడంతో డీఆర్ఐ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

విచారణ అనంతరం రన్యా రావు సహా ఈ కేసులో ఉన్న నలుగురు నిందితులకు ఒక సంవత్సరపు జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే ఈ జరిమానా షోకాజ్ నోటీసు వచ్చిందని అధికారులు తెలిపారు.ఇదిలా ఉండగా, ఈ కేసుతో సంబంధం ఉన్న మరో అంశంపై విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ , స్మగ్లింగ్ నివారణ బోర్డు (COFEPOSA) దాఖలు చేసిన పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను కోర్టు సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది.

ఈ కేసు మరోసారి కన్నడ సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఒక ప్రముఖ నటి ఈ స్థాయిలో అక్రమ కార్యకలాపాల్లో భాగస్వామిగా ఉండడం ఆశ్చర్యంగా మారిందని పరిశ్రమలో పలు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రన్యా రావు పైన విధించిన జరిమానా, విచారణలు, కోర్టు కేసుల నేపథ్యంలో ఆమె భవిష్యత్తు సినీ కెరీర్‌పై కూడా అనేక అనుమానాలు నెలకొన్నాయి. నెటిజన్లు రకరకాల కామెంట్లు కూడా చేస్తున్నారు.