కరోనా ప్రభావంతో అన్ని రంగాలు కుదేళవుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కాగా చాలా రంగాలు ఎప్పటికి కోలుకుంటాయో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా వినోద రంగం లాక్‌ డౌన్‌ కారణంగా తీవ్ర సంక్షోబంలో కూరుకుపోయింది. నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిలేక ఇబ్బంది పడుతున్నారు. ఆర్ధికంగా చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. రోజు వారి కూలీ చేసే వారికి పూట గడవటమే కష్టంగా ఉంటే, మధ్య తరగతి వాళ్ల పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది.

సీరియల్స్‌లో నటించే ఆర్టిస్ట్‌లకు కరోనా కష్టాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ సీరియల్‌ నటుడు మానస్‌ షా షూటింగ్‌లు లేకపోవటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. డబ్బులు లేకపోవటంతో తన కారును కూడా అమ్మేశాడు. మానస్‌కు లాక్ డౌన్‌కు ముందు నటించిన హమారి బహు సిల్క్ షోకు సంబంధించి డబ్బు రావాల్సి ఉన్నా ఇంకా మొత్త అందలేదట.. దీంతో తప్పని సరిపరిస్థితుల్లో కార్‌ అమ్మేయాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు.

ఈ పరిస్థితిపై స్పందించిన మానస్‌.. `నేను జీవితంలో తొలిసారి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నా. తీవ్ర ఆర్థిక సమస్యలు నన్ను చుట్టు ముట్టాయి. దీంతో కారు అమ్మటమే కాదు ఇంటి అద్దె చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇళ్లు ఖాళీ చేసి బంధువుల ఇంట్లో ఉంటున్నాను` అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు మానస్‌. ఈ యువ నటుడు హమారీ దేవ్రాణి, సంకట్మోచన్ మహాబలి హనుమాన్‌ లాంటి సూపర్‌ హిట్‌ షోలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.