కరోనా ప్రభావం తెలుగు చిత్ర పరిశ్రమపై బాగా పడింది. కేంద్రంతోపాటు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగులు అనుమతి ఇచ్చినప్పటికీ పెద్దగా షూటింగులు జరగడం లేదు. అప్పటికీధైర్యం చేసిన షూటింగ్ లలో కరోనా దెబ్బ కొడుతోంది. దాంతో స్టార్ హీరోలు సినిమా షూటింగులు భయం భయంగా జరుపుకోవాల్సిన పరిస్దితి ఏర్పడింది.  సినిమా షూటింగ్
సమయంలో  ఏ ఒక్కరికీ కరోనా లక్షణాలున్నా అది అందరికీ సోకే ప్రమాదం ఉంది. స్టార్ హీరో, హీరోయిన్, దర్శక, కెమెరామెన్ వంటి ముఖ్యలకు ఒకవేళ కరోనా సోకితే ఆ
సినిమాతోపాటు వాళ్లు ఒప్పుకునే మిగితా సినిమాలన్నీ ఆగిపోయే ప్రమాదం ఉంది.  ఈ క్రమంలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''టక్ జగదీష్'' యూనిట్ సభ్యుడికి
కరోనా సోకిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

నాని 'టక్ జగదీష్' షూటింగ్ హైదరాబాద్ లో రీసెంట్ గా ప్రారంభించారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా మూవీ టీమ్ షూట్ చేశారు. నాని - రీతూ వర్మ పాల్గొంటున్న కీలక
సీన్స్ ను  షూట్ చేసారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు యూనిట్ లోని ఒకరికి కరోనా సోకిందని తెలుస్తోంది. ఆ వ్యక్తి ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యాడో అనే అనుమానంతో ముందు
జాగ్రత్తగా షూటింగ్ నిలిపివేసి.. అందరూ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయమై చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. చిత్ర యూనిట్ ప్రకటన చేసి ఈ వార్తలపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలంటున్నారు.

ఇక  'టక్ జగదీష్' చిత్రానికి 'నిన్ను కోరి' 'మజిలీ' వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా
తెరకెక్కుతున్న ఈ సినిమాలో రీతూ వర్మ - ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి - హరీశ్ పెద్ది సంయుక్తంగా
నిర్మిస్తున్నారు. నాని కెరీర్లో 26వ చిత్రంగా వస్తున్న 'టక్ జగదీష్' పై సినీ వర్గాల్లో మంచి అంచనాలే ఉన్నాయి.