ఆదిపురుష్ విడుదలకు నేపాల్ లో బ్రేక్ పడింది. ఓ డైలాగ్ విషయంలో వివాదం రాజుకున్న నేపథ్యంలో అక్కడ అభ్యన్తరాలు వ్యక్తం అవుతున్నాయి.  

సీత జన్మస్థలాన్ని ఉద్దేశిస్తూ ఆదిపురుష్ లో పెట్టిన ఓ డైలాగ్ నేపాల్ సెన్సార్ సభ్యులు తప్పుబట్టారు. ఆ డైలాగ్ తొలగించకుండా కుంటే విడుదల నిలిపివేస్తామని హెచ్చరించారు. సీత భరతమాత బిడ్డ, ఆమె భారత దేశంలో పుట్టారని ఆదిపురుష్ లో ఓ సన్నివేశంలో చెప్పారు. 

ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేశమైన నేపాల్ ప్రజల నమ్మకం ప్రకారం సీత నేపాల్ లో జన్మించారు. ఆమె భారతదేశంలో పుట్టారని డైలాగ్ ఉన్న నేపథ్యంలో ఆదిపురుష్ విడుదల నిలిపివేశారు. అయితే ఆదిపురుష్ యూనిట్ ఆ డైలాగ్ తొలగించేందుకు అంగీకారం తెలపడంతో విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. ఉదయం ఆటలు క్యాన్సిల్ కాగా, మధ్యాహ్నం నుండి ప్రదర్శనలు మొదలైనట్లు సమాచారం. 

ఆదిపురుష్ రామాయణగాథగా తెరక్కింది. రాముడు పాత్రలో ప్రభాస్ కనిపించారు. జానకి పాత్రలో కృతి సనన్ నటించారు. జానకిని అపహరించే లంకేశ్వరుడు పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించారు. కెరీర్లో మొదటిసారి ప్రభాస్ పౌరాణిక చిత్రం చేశారు. అందులోనూ ఐకానిక్ రాముడు పాత్రలో మెప్పించారు. 

దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో ఆదిపురుష్ తెరకెక్కింది. టి సిరీస్ బ్యానర్లో భూషణ్ కుమార్ నిర్మించారు. అజయ్-అతుల్ సంగీతం అందించారు. జూన్ 16న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల చేశారు. ఆదిపురుష్ చిత్రంపై భారీ హైప్ నెలకొనగా పెద్ద మొత్తంలో ఓపెనింగ్స్ దక్కాయి. ఆదిపురుష్ ఫస్ట్ డే వసూళ్లు రికార్డు స్థాయిలో ఉండనున్నాయి. మూవీ మాత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. వీకెండ్ ముగిస్తే కానీ చిత్ర ఫలితం పై అవగాహనరాదు.