యంగ్ హీరోలపై మనసు పారేసుకున్న మాటల మాంత్రికుడు యువ హీరోలతో సినిమాలకు భారీ పెట్టుబడులు పెడుతున్న త్రివిక్రమ్ నాని హీరోగా అవసరాల సినిమాకు త్రివిక్రమ్ పెట్టుబడి
'హారిక అండ్ హాసిని క్రియేషన్స్' బేనర్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పార్ట్ నర్ అనే టాక్ ఉంది. త్రివిక్రమ్ దీన్ని ఖండించినప్పటికీ వరుసగా ఆ బేనర్లోనే సినిమాలు చేయడం ఈ సందేహాలకు బలం చేకూరుస్తోంది. ఐతే ఇప్పుడు త్రివిక్రమ్ నేరుగా నిర్మాణంలోకి అడుగుపెట్టేస్తున్నాడు.
నితిన్ హీరోగా లిరిసిస్ట్ టర్న్డ్ డైరెక్టర్ కృష్ణచైతన్య తీయబోయే సినిమాకు త్రివిక్రమే నిర్మాత. ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ సమర్పకుడిగా వ్యవహరించనున్నారు. దీని తర్వాత కూడా నిర్మాతగా వరుసబెట్టి సినిమాలు తీయడానికి త్రివిక్రమ్ సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం.
నాని హీరోగా అవసరాల శ్రీనివాస్ ఒక సినిమా చేయడానికి కమిటైన సంగతి తెలిసిందే. 'జ్యో అచ్యుతానంద' తర్వాత అవసరాల చేసే సినిమా ఇదే. తాను హీరోగా తెరకెక్కుతున్న 'బాబు బాగా బిజీ' మీద ఫోకస్ పెట్టిన అవసరాల.. ఈ మధ్యే దాన్ని పూర్తి చేశాడు. ఇప్పుడిక దర్శకుడి పాత్రలోకి మారిపోతున్నాడు అవసరాల. నాని కోసం స్క్రిప్టు తయారు చేసే పనిలో ఉన్నాడు. స్క్రిప్టు పూర్తయ్యాక నిర్మాతను చూసుకుందామనుకున్నాడు.. కానీ ఈ లోపే ఈ సినిమాను నిర్మించడానికి త్రివిక్రమ్ ముందుకొచ్చినట్లు సమాచారం.
మరోవైపు యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ హీరోగా నందిని రెడ్డి తీయాల్సిన సినిమాకు కూడా త్రివిక్రమే పెట్టుబడి పెట్టనున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ తీరు చూస్తుంటే అభిరుచి ఉన్న యంగ్ టీంతో వరుసగా సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లున్నాడు.
