సైరా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ లో బిజీగా పాల్గొంటున్న మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి ప్రాజెక్ట్ లపై కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సైరా అనంతరం కొన్ని రోజులు రెస్ట్ తీసుకోనున్నారు. ఇక ఆ తరువాత కొరటాల శివ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయనున్నారు. 

ఆ సినిమాలో మెగాస్టార్ రెండు డిఫరెంట్ గెటప్స్ లో డ్యూయల్ రోల్స్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని చెప్పిన చిరు కొరటాల శైలిలో మంచి సందేశాత్మక చిత్రంగా సినిమా తెరకెక్కనున్నట్లు వివరణ ఇచ్చారు. అలాగే త్రివిక్రమ్ తో కూడా ఒక ప్రాజెక్ట్ లో నటించే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటికే ఒక లైన్ చెప్పిన త్రివిక్రమ్ పూర్తి కథను సిద్ధం చేశాక మరోసారి చర్చలు జరుగుతాయని ఆ కథ మంచి ఎంటర్టైనర్ గా తెరకెక్కే అవకాశం ఉందని అన్నారు. 

ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో అల వైకుంఠపురములో.. అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా అనంతరం వెంకటేష్ - జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో త్రివిక్రమ్ వర్క్ చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు మెగాస్టార్ కూడా నటించే అవకాశం ఉందని తెలియడంతో త్రివిక్రమ్ నెక్స్ట్ ఎవరితో వర్క్ చేస్తారనేది సస్పెన్స్ గా మారింది.