టాలీవుడ్‌ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కరోనా సెకండ్‌ వేవ్‌ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పుడది టాలీవుడ్‌ని షేక్‌ చేస్తుంది. ఒకేసారి టాప్‌ సెలబ్రిటీలను అంటుకోవడంతో తెలుగు చిత్ర పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నారు. మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్‌, మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌, `వకీల్‌సాబ్‌` నటి నివేదా థామస్‌ కరోనాకి గురయ్యారు. ఒకేసారి ఈ ముగ్గురికి కరోనా సోకిందనే విషయం తెలిసి టాలీవుడ్‌ ఉలిక్కి పడుతుంది. 

నివేదా థామస్‌కి గత రెండు రోజుల క్రితమే కరోనా సోకిందని సమాచారం. అయితే ఆ విషయాన్ని శనివారం రాత్రి ప్రకటించింది నివేదా. దీంతో ఆమె హాజరు కావాల్సిన ప్రెస్‌మీట్‌ కూడా క్యాన్సిల్‌ అయ్యింది. మరోవైపు ఈ రోజు రాత్రి జరుగబోయే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి కూడా తాను హాజరు కాలేకపోతున్నానని వెల్లడించింది. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, అందరు జాగ్రత్తగా ఉండమని చెప్పింది.  మరోవైపు మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌కి కూడా కరోనా సోకింది. ఆయన గత కొన్ని రోజులుగా కరోనా లక్షణాలు కనిపించడంతో సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉండిపోయారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, దాదాపు రికవరీ అయ్యిందని ఆయన టీమ్‌ వెల్లడించింది. 

మరోవైపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కి కూడా కరోనా పాజిటివ్‌ వచ్చిందట. కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా, పాజిటివ్‌ అని తేలిందని, ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారని సమాచారం. ఆయన ఆరోగ్యం కూడా బాగానే ఉందని తెలుస్తుంది. పీఆర్‌ వర్గాలు వెల్లడించాయి. ముగ్గురు టాప్‌ సెలబ్రిటీలకు కరోనా సోకిందనే వార్త టాలీవుడ్‌ని ఆందోళనకి గురి చేస్తుంది. ఇటీవల కాలంలో వీరిని కలిసి వారంతా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు మెగా ఫ్యామిలీ హీరోలు సైతం ఆందోళన చెందుతున్నట్టు టాక్‌. 

నివేదా థామస్‌ ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ రీఎంట్రీచిత్రం `వకీల్‌సాబ్‌`లో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. మరోవైపు త్రివిక్రమ్‌.. ఎన్టీఆర్‌తో సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు. అలాగే అల్లు అరవింద్‌ నిర్మాతగా పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.