మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఇప్పటికే `అతడు`, `ఖలేజా` చిత్రాలు వచ్చాయి. `అతడు` ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమా థియేటర్‌లో కంటే టీవీలో ఎక్కువగా ఆడింది. ఎక్కువసార్లు టెలికాస్ట్ అయిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. చాలా విషయాలకు ఇదొక స్ఫూర్తిగానూ నిలిచింది. మరో చిత్రం `ఖలేజా` డిజాస్టర్‌గా నిలిచింది. 


వీరి కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సినిమా కోసం చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు వర్కౌట్‌ కాలేదు. ఇప్పట్లో వీరి కాంబినేషన్‌లో సినిమాని ఎవరూ ఊహించడం లేదు. ఎందుకంటే ఓ వైపు మహేష్‌ తన ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు, మరోవైపు త్రివిక్రమ్‌ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ లను లైన్‌లో పెడుతున్నాడు. ఈ నేపథ్యంలో మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా అనే ప్రస్తావనే లేదు. 

కానీ ఉన్నట్టుండి తాజాగా మహేష్‌, త్రివిక్రమ్‌ మధ్య కథా చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. కరోనా నేపథ్యంలో ఉన్న ఖాళీ సమయంలో మహేష్‌తో చేయాల్సిన ప్రాజెక్ట్ కి సంబంధించిన స్క్రిప్ట్ పనులను మాటల మాంత్రికుడు పూర్తి చేశారని, అంతేకాదు, మహేష్‌ని కలిసి కథ కూడా వినిపించాడని, ఈ విషయంలో మహేష్‌ కాస్త సానుకూలంగానే ఉన్నట్టు సమాచారం. అన్ని కుదిరితే ఇది మహేష్‌ నెక్ట్స్ సినిమాగానే తెరకెక్కే అవకాశాలున్నట్టు టాక్‌. ఇదే సెట్‌ అయితే హ్యాట్రిక్‌ ఖాయమనే చెప్పాలి. మరి అది ఎంత వరకు వర్కౌట్‌ అవుతుందో, ఈ లోపు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. 

మహేష్‌బాబు ప్రస్తుతం పరశురామ్‌ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత రాజమౌళితో ఓ సినిమా చేసే అవకాశాలున్నాయి. మరోవైపు త్రివిక్రమ్‌.. ఎన్టీఆర్‌తో సినిమాని ప్రకటించారు. అంతేకాదు చిరంజీవితోనూ చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.