ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగొందిన త్రిష ప్రస్తుతం కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. అయితే త్వరలోనే ఆమె తెలుగు సినిమాలో నటించబోతుందని సమాచారం. అది కూడా మెగాస్టార్ సినిమా అని చెబుతున్నారు.

'ఖైదీ నెంబర్ 150' సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి సినిమాల విషయంలో కాస్త స్పీడ్ పెంచారు. అక్టోబర్ 2న ఆయన నటించిన 'సైరా' విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఈ సినిమా తరువాత చిరంజీవి తన 152వ చిత్రాన్ని కొరటాల శివ డైరెక్షన్ లో చేయబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో హీరోయిన్ గా ఎవరిని తీసుకోబోతున్నారనే విషయంలో అనుష్క, శృతి హాసన్, ఐశ్వ‌ర్య‌రాయ్ ఇలా కొందరి పేర్లు వినిపించాయి.

కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషని తీసుకోవాలని అనుకుంటున్నారట. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరిపినట్లు టాక్. ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి వుంది. గతంలో త్రిష.. 'స్టాలిన్' సినిమా కోసం చిరుతో జత కట్టింది. ఇప్పుడు మరోసారి అతడి సరసన చిందులు వేయడానికి సిద్ధమవుతోంది.