సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి చిత్ర సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. కొంత షార్ట్ గ్యాప్ తీసుకుని అనిల్ రావిపూడి చిత్రంతో బిజీ కానున్నాడు. మహేష్ 26వ చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ చిత్రానికి రెడ్డిగారి అబ్బాయి, సరిలేరు నీకెవ్వరూ అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఈ చిత్రంలో దేశభక్తి, హాస్యం ప్రధానంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. 

వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి మహేష్ బాబుని డైరెక్ట్ చేయనుండడంతో ఆసక్తి నెలకొంది. అనిల్ రావిపూడి వరుసగా పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్2 చిత్రాలతో తిరుగులేని దర్శకుడిగా మారిపోయాడు. ఇదిలా ఉండగా అనిల్ రావిపూడి మహేష్ 26వ చిత్రం కోసం అదిరిపోయే కామెడీ సన్నివేశాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశం సినిమా మొత్తానికే హైలైట్ గా నిలవనుందట. 

ట్రైన్ లో ఈ ఫన్నీ సన్నివేశం జరుగుతుందని అంటున్నారు. గతంలో రవితేజ వెంకీ చిత్రంలో ట్రైన్ సీన్ కడుపుబ్బా నవ్వించేలా ఉంటుంది. అదే తరహాలో అనిల్ రావిపూడి మహేష్ చిత్రంలో ఓ కామెడీ ట్రాక్ సిద్ధం చేశాడట. ఈ సన్నివేశం మహేష్ బాబు, బండ్ల గణేష్, శ్రీనివాస్ రెడ్డిపై ఉంటుందని అంటున్నారు.