టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ అనుమోలు కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు.
టాలీవుడ్‌ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గత ఏడాది కాలంగా దిగ్గజాలు ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నారు. ఇటీవలే తారకరత్న కన్నుమూశారు. ఆ విషాదం నుంచి బయటపడక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. యువ కెమెరామెన్ కన్నుమూశారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ అనుమోలు హార్ట్ ఎటాక్‌తో కన్నుమూశాడు. ఆయన ఆదివారం గుండెపోటుతో మరణించడంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
2017లో వచ్చిన `దర్శకుడు` చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు ప్రవీణ్ అనుమోలు. అంతకు ముందు `బాజీరావు మస్తానీ, `ధూమ్3`, `బేబీ`, `పంజా`, `యమదొంగ` చిత్రాలకు ఆయన అసిస్టెంట్ కెమెరామెన్‌గా పనిచేశారు. సుకుమార్ డైరెక్షన్ టీమ్‌లో వర్క్ చేసిన జక్కా హరి ప్రసాద్ దర్శకత్వం వహించిన `దర్శకుడు` సినిమాతో సినిమాటోగ్రాఫర్‌గా మారారు. అశోక్ బండ్రెడ్డి హీరోగా నటించిన ఈ చిత్రంలో ఈషా రెబ్బా హీరోయిన్‌గా నటించింది. ఇప్పుడు మరికొన్ని సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్‌గా బిజీ అవుతున్న నేపథ్యంలో ఆయన హార్ట్ ఎటాక్‌తో హఠాన్మరణం చెందడం అత్యంత విచారకరం. ప్రవీణ్ అనుమోలు మృతి పట్ల టాలీవుడ్ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఆయన మరణం పట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు.
ఇటీవల కాలంలో తెలుగులో దిగ్గజ నటులు కృష్ణంరాజు, కృష్ణ, కైకాల సత్యానారాయణ, చలపతిరావు, దిగ్గజ దర్శకుడు కళాతపస్వి కె విశ్వనాథ్, ఆయన సతీమణి, అలాగే మహేష్ తల్లి ఇందిరాదేవి, సింగర్ వాణీ జయరాం కన్నుమూసిన విషయం తెలిసిందే. అంతేకాదు ఇటీవల కాలంలో వరుసగా సెలబ్రిటీలు హార్ట్ ఎటాక్‌తో కన్నుమూయడం అత్యంత విచారకరం.
