తెలుగు సినీ నటుడు నాగబాబు కుమార్తె నిహారిక వివాహం గుంటూరుకి చెందిన ఐజీ ప్రభాకర్ రావు తనయుడు చైతన్యతో బుధవారం సాయంత్రం ఘనంగా జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో డెస్టినేషన్‌ మ్యారేజ్‌ తరహాలో ఈ పెళ్లి వేడుక జరిగింది. కనువిందుగా జరిగిన ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ సందడి చేసింది. ఆద్యంతం కనువిందుగా, మెస్మరైజింగ్‌గా నిహారిక, చైతన్యల వివాహం జరిగింది.  

ఈ వివాహానికి మెగా, అల్లు కుటుంబాలతో పాటు చాలామంది సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఇలా తన చెల్లి వివాహానికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వధించిన ప్రతి ఓక్కరికి హీరో వరుణ్ తేజ్ ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశాడు.  

 

''నా బంగారు తల్లి నిహారిక డాషింగ్ బావ చైతన్య వివాహ జీవితంలోకి అడుగుపెట్టారు. వారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు. ఈ క్షణంలో నేను ఎంత ఆనందంగా వున్నానో మాటల్లో చెప్పడానికి రావడంలేదు. ఈ జంటకు ఎంతో ప్రేమతో అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు'' అంటూ హీరో వరుణ్ తేజ్ ట్వీట్ చేశాడు. 

తన గారాలపట్టి ఓ ఇంటికి కోడలు కావడంతో నాగబాబు కూడా భావోద్వేగానికి గురయ్యారు. ''సరికొత్త జీవితం ఆరంభించబోతున్న నీకు శుభాకాంక్షలు. తను స్కూలుకు వెళ్లిన మొదటి రోజు నాకింకా గుర్తుంది. అప్పుడైతే సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చేది. కానీ ఇప్పుడలా కాదు. నా చిన్నారి కూతురు స్కూలుకు వెళ్లేంత పెద్దదై పోయిందనే నిజం నమ్మడానికే నాకు చాలా ఏళ్లు పట్టింది. తనతో ఇరవై నాలుగు గంటలు ఆడుకోలేననే బాధ వెంటాడేది. ఇంకెన్నాళ్లు ఇలాంటి ఫీలింగ్‌ ఉంటుందో.. కాలమే నిర్ణయిస్తుంది.. నిన్ను ఎంతగానో మిస్సవుతున్నా నిహా తల్లి'' అంటూ ట్వీట్ చేశారు.